హైదరాబాద్ లో క్షుద్రపూజల కలకలం రేగింది. ఏకంగా కంట్లో కారం చల్లుకుని కొట్టుకునే వరకు వచ్చింది. మణికొండ శివాజీ నగర్‌లో జూన్ 16 (మంగళవారం) వెలుగు చూసింది ఈ ఘటన. సోమవారం అమావాస్య కావడంతో.. ఒక కుటుంబం రోజు నిర్వహించిన ప్రత్యేక పూజలు వివాదానికి దారితీసింది.
ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఉంచి పూజలు చేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పూజలు చుట్టుపక్కల వారిలో భయాందోళనలు కలిగిస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో సంబంధిత కుటుంబాన్ని ప్రశ్నించగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని తెలిపారు.
వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీయగా, ఓ మహిళ ఎదురింటి వారి కళ్లలో కారం చల్లింది. దీంతో శివాజీ నగర్‌లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
