
- ఏడాది దాటినా కనిపించని పురోగతి
- మొదట కలెక్టర్ల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్.. ఆ తర్వాత పట్టింపు కరువు
- మౌలిక సౌకర్యాల ఆశలు ఆవిరి
నిర్మల్, వెలుగు: హెచ్ఎండీఏ తరహాలోనే ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు(యూడీఏ) ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యా యి. మూడు జిల్లాల అథారిటీల ఏర్పాటుకు ఏడాది క్రితం కలెక్టర్లు రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాలో ‘అవుడా’, మంచిర్యాల, జిల్లాలో ‘ముడా’, నిర్మల్ జిల్లాలో ‘నుడా’ పేరిట ఈ అర్బన్ అథారిటీలు ఏర్పాటు చేయాలని తలపెట్టారు.
పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలను కూడా ఈ అథారిటీల పరిధిలోకి చేర్చుతూ ప్రతిపాదనలు రూపొందించారు. ప్రభుత్వం సైతం మొదట ఈ ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి తమకు పంపాలని ఆయా జిల్లాల కలెక్టర్లను కోరింది. దీంతో కలెక్టర్లంతా ఆగమేఘాల మీద అథారిటీల ఏర్పాటు కోసం సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించి ప్రతిపాదనలను రూపొందించింది. కానీ ఏడాది దాటుతున్నా ఆ ప్రతిపాదనలను ఇప్పటివరకు పరిశీలించలేదు.
ఇండస్ట్రియల్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్ల వివాదాలకు పరిష్కారం
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటైతే మున్సిపాలిటీల్లో మాస్టర్ ప్లాన్ పక్కాగా అమలవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు అమలైన మాస్టర్ ప్లాన్ గడువు తీరిపోయినప్పటికీ వివిధ పరిపాలన సాంకేతిక కారణాలతో దాన్నే కొనసాగిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా ఇండస్ట్రియల్, కమర్షియల్ జోన్ల విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పడితే కొత్త మాస్టర్ ప్లాన్లు రూపొందించి పకడ్బం దీగా అమలు చేసే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రియల్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్ల వివాదాలకు పరిష్కారం లభిస్తుంది.
మౌలిక సౌకర్యాలు ఏర్పడే అవకాశం
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పడితే పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా వీటి పరిధిలోకి వచ్చే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాలు ఏర్పడనున్నాయి. ఆయా జిల్లాల్లో కొత్త మాస్టర్ ప్లాన్లు అమలవుతాయి. మూడు జిల్లాల్లోని మున్సిపాలిటీలు, భారీ సంఖ్యలో గ్రామపంచాయతీలను వీటి పరిధిలోకి తీసుకువస్తారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 420 గ్రామపంచాయతీలను నుడా పరిధి లో చేర్చుతూ ప్రతిపాదనలున్నాయి. ఫలితంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల రోడ్ల లింకేజీ, తాగునీటి సౌకర్యం కల్పించడం, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు సాటిలైట్ టౌన్ షిప్లు ఏర్పడతాయి.