- అందుకే కాంగ్రెస్ కు పట్టం కట్టారు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పట్టణ ప్రాంత ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారని.. అందుకే కాంగ్రెస్ కు పట్టం కట్టారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రజా పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని, ఇందుకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని స్పష్టం చేశారు.
నిజామాబాద్ లోని తన సొంత వార్డు 47వ డివిజన్లో కాంగ్రెస్ గెలిచిందని, దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ 75 శాతానికి పైగా సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని మహేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు స్పష్టమైన విజయం కట్టబెట్టిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
