యూరిన్ లో ఉడకబెట్టిన కోడి గుడ్లు.. స్పెషల్ అంటూ లొట్టలేసుకుని తింటున్నారు

యూరిన్ లో ఉడకబెట్టిన కోడి గుడ్లు.. స్పెషల్ అంటూ లొట్టలేసుకుని తింటున్నారు

కాస్త గుండె దిటవు చేసుకుని ఈ వార్తను చదవండి. ఏమయినా తినుబండారాన్ని చేత్తో పట్టుకుని తింటూ వార్తను చదివితే.. ఆ తర్వాత మీరు డోక్కునే అవకాశం కూడా ఉండొచ్చు.ఇది చైనా వాసులు లొట్టలు వేసుకుంటూ తినే గుడ్లతో చేసే ఒక వంట కథ. మామూలు గుడ్ల వంటకమేగా అనుకోకండి. మేమూ మా ఇళ్లలో తరచుగా తింటూనే ఉంటామంటారా? మనం తినే గుడ్డు కూరకు, చైనావాసులు ప్రత్యేకంగా తినే ఈ గుడ్డు వంటకు పోలికపెడితే ఆ తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది. ఈ గుడ్ల వంటకాన్ని మూత్రంతో వండుతారు.

గుడ్లు భలే టేస్టీగా ఉంటాయి. అంతేకాదు.. గుడ్లలో బోలెడన్ని పోషకాలు కూడా ఉంటాయి. అందుకే.. పిల్లల నుంచి పెద్దలు వరకు ప్రతి ఒకరు రోజుకు కనీసం ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణం మనం గుడ్లను నీటిలో ఉడికించి తింటాం. అయితే  చైనాలోని డోంగ్యాంగ్ ప్రాంతంలో మాత్రం.. గుడ్లను మూత్రంలో ఉడికించి తింటారు. ఇందుకు బలమైన కారణమే ఉందని స్థానికులు చెబుతారు. చివరికి ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదించింది.

చైనాలో వింత వంటకం

మనం గుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాత వాటిని మంచినీటిలో ఉడికించుకుని తింటే... చైనాలో మాత్రం పదేళ్ల లోపు బాలుర మూత్రంలో ఉడికించుకుని తింటారు. ఈ వంటకానికి చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌ తీర ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఈ గుడ్లను తింటారు. ముందుగా గుడ్లను ఒక రోజంతా మూత్రంలో నానబెడతారు. ఆ తర్వాత మూత్రంతో సహా పొయ్యిపై పెట్టి ఉడికిస్తారు. గుడ్డు పెంకు పగిలే వరకు ఆ గుడ్లను ఉడికిస్తారు. ఆ గుడ్లు మూత్రాన్ని పీల్చుకొనేవరకు ఉడికిస్తూనే ఉంటారు. 

స్కూళ్లలో మూత్రం సేకరణ

డోంగ్యాంగ్‌లో సాయంత్రం కాగానే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు స్కూళ్ల వద్ద క్యూ కడతారు. వారితోపాటు వ్యాపారులు సైతం స్కూళ్ల వద్దకు బకెట్లు, డ్రమ్ములతో చేరుకుంటారు. అయితే, వీరంతా వేచి చూసేది.. విద్యార్థుల కోసం కాదు. వారి మూత్రం కోసం. పిల్లలు ఇళ్లకు చేరగానే.. వ్యాపారులంతా స్కూల్‌లోని మూత్రశాలల్లోకి వెళ్లి.. యూరిన్‌ను సేకరిస్తారు. ముందుగానే స్కూళ్లలో ఏర్పాటుచేసిన డ్రమ్ముల్లోని మూత్రాన్ని కలెక్టు చేసుకుంటారు. ఆ తర్వాత ఆ మూత్రంలో గుడ్లు వేసి రోజంతా నానబెడతారు. ఆ తర్వాత వాటిని ఉడికించి, విక్రయిస్తారు.

చాలా టేస్టీగా ఉంటాయట

ఇలా మూత్రంలో ఉడికించిన గుడ్లు చాలా టేస్టీగా ఉంటాయట. వాసన కూడా చాలా బాగుంటుందట. మూత్రంలో బాగా నానుతూ ఉడకం వల్ల ఆ గుడ్లలో ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదట. అయినా.. మూత్రంలో గుడ్లు ఉడికించడం ఏమిటీ? మీకేమైనా పిచ్చా అని అడిగితే.. .ప్రాచీన కాలం నుండే ఈ వంట విశేష ప్రాచుర్యంలో ఉందని వారు చెబుతున్నారు. పైగా ఈ గుడ్లను తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుందని, రక్త ప్రసరణ మెరుగు పడుతుందని చెబుతున్నారు. నడుము, కాళ్ళు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయని అంటున్నారు. 

బజ్జీల మాదిరిగా.. 

సాయంవేళ వీధుల్లో అలా అలా నడిచి వెళ్తున్నపుడు, వేడి వేడి బజ్జీల వాసన సోకగానే మన అడుగులు మనకు తెలియకుండానే అటుగా ఎలా వెళ్లిపోతాయో ..   ఈ మూత్రపు గుడ్ల వాసన సోకగానే చైనీయులు కూడా అలాగే అడుగులు వేస్తారట. అంతేకాదు.. స్థానికులు కూడా 10 ఏళ్ల లోపు వయస్సు గల పిల్లల మూత్రాన్ని సేకరించి ఇళ్లలోనే ఈ రెసిపీని తయారు చేసుకుని స్నాక్స్‌లా ఆరగిస్తారు. అయితే, వైద్యులు మాత్రం ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తుంటే.. స్థానికులు మాత్రం మేం ఎన్నో ఏళ్ల నుంచి ఈ గుడ్లను తింటున్నామని, ఇప్పటివరకు తమకు ఎలాంటి అనారోగ్యం రాలేదని అంటున్నారు.

ఇది తినకపోతే రోజు గడవదు..

"ఈ గుడ్లను తింటే వడదెబ్బ తగలదని చైనీయులు చెబుతున్నారు. . మూత్రంలో ఉడికించిన ఈ గుడ్ల వాసన మస్తుంటుంది," అని జీ యోహువా అనే దుకాణదారు చెప్పాడు. మాకు ఈ గుడ్లు తిననిదే అసలు రోజే గడవదు, మా కుటుంబం అంతా ఇష్టపడి తినే వంటకమిది అని ఇంకో చైనీయుడు చెప్పాడు.