వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఫ్రీ

వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఫ్రీ

అవును.. మీరు చదివింది నిజమే. మన దగ్గర కాదు.. మనదేశంలో అంతకంటే కాదు. అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఆఫర్ మందుబాబులను, 21 ఏళ్లు పైబడిన యూత్ ను ఆకట్టుకునేలా ఉండడంతో హాట్ టాపిక్ అయింది. ప్రపంచంలోనే అత్యంత అగ్రరాజ్యం అమెరికా కరోనా ప్రబలాక కట్టడి విషయంలో ఇతర దేశాలు.. చిన్న చితక దేశాలతో పోటీపడలేని ఘటనలు వారికి అవమానంలా తోచాయి. అందుకే విమర్శలకు చెక్ పెట్టి మునపటిలా ప్రపంచమంతా కర్రపెత్తనం చెలాయించాలని అమెరికా తహతాహలాడుతోంది. 
ఈనేపధ్యంలో అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను జెట్ స్పీడుతో పరుగులు పెట్టించాలని చూస్తున్నా బద్దకం మహారాజులు తూచ్.. పో.. అంటున్నారు. వచ్చే జులై 4వ తేదీన అమెరికా స్వాతంత్ర దినోత్సవం. ఆ రోజు నాటికి దేశంలో 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అమెరికా టార్గెట్ పెట్టుకుంది. అయితే బద్దకం బాబుల వల్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం మెల్లగా సాగుతోంది. వ్యాక్సినేషన్ పూర్తయితే తప్ప మునపటి పరిస్థితులు ఏర్పడేలా లేవు మరి. ఆర్ధికంగా దెబ్బతిన్న కంపెనీలు తమ వంతు చేయూతనిచ్చేలా తమ ఉద్యోగులు, వారి కుటుంబీకులందరూ వ్యాక్సిన్ వేసుకునేలా రకరకాల తాయిలాలు ప్రకటిస్తున్నాయి. క్ర్రీడా పోటీలు చూసే టికెట్లు, చిరు తిండ్లు, నగదు వంటి వాటితోపాటు.. ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు సైతం ప్రకటిస్తున్నాయి. 
ఇవన్నీ ఒక ఎత్తు అయితే బీర్ల కంపెనీ ‘అన్ హైజర్ బుష్’ ఆకర్షణీయమైన ఆఫర్ ను ప్రకటించింది. వ్యాక్సిన్ వేయించుకుని తమ వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకుంటే 5 అమెరికన్ డాలర్ల విలువైన బీర్ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకున్న తొలి రెండు లక్షల మందికి ఈ బీర్ ఉచితంగా ఇస్తామని షరతు విధించింది. 21 ఏళ్లు పైబడిన యూత్ ను టార్గెట్ చేస్తూ ప్రకటించిన ఈ ఆఫర్ ఆకర్షణీయంగా ఉండడం హాట్ టాపిక్ అయింది.