అమెరికాలో ఒక్కరోజే..5 లక్షల మందికి కరోనా

అమెరికాలో ఒక్కరోజే..5 లక్షల మందికి కరోనా
  • ఇప్పటి వరకు డైలీ కేసుల్లో ఇవే హయ్యెస్ట్
  • న్యూయార్క్, కాలిఫోర్నియాలో భారీగా బాధితులు  
  • ఒమిక్రాన్​తో 58%, డెల్టాతో 41% కేసులు నమోదు  

వాషింగ్టన్:  కరోనా మహమ్మారి అమెరికాను మళ్లీ ఆగమాగం చేస్తోంది. దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 5,12,000 మందికి వైరస్ అంటుకుంది. ప్రధానంగా న్యూయార్క్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దేశంలో వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ ఈ ఏడాది జనవరి 8న అత్యధికంగా 2,94,015 కేసులు నమోదు కాగా, ఇప్పుడు ఏకంగా 5 లక్షలకుపైనే డైలీ కేసులు రికార్డ్ అయ్యాయి. మొత్తం కేసులు 5.40 కోట్లు దాటాయి. దేశవ్యాప్తంగా మరో 1,762 మంది కరోనాతో చనిపోయారని, మొత్తం మృతుల సంఖ్య8.42 లక్షలకు చేరిందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. దేశంలో ఇంకా 1.19 కోట్ల యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. దేశంలో వీక్లీ యావరేజ్ లోనూ అత్యధిక కేసులు నమోదయ్యాయని తెలిపింది. గత ఏడు రోజుల్లో సగటున రోజూ 2.67 లక్షల కేసులు వచ్చాయని వివరించింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు మరింతగా పెరిగే సూచనలు కన్పిస్తున్నాయని సీడీసీ డైరెక్టర్ రోషెల్ వాల్సెంకీ వెల్లడించారు. బాధితులు సీరియస్ కండిషన్​లోకి మాత్రం వెళ్లడంలేదన్నారు.  
ఒమిక్రాన్ బాధితులే 58.6%..   
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా స్పీడ్ గా వ్యాపిస్తుండటం వల్లే అమెరికాలో కేసులు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో వ్యాపిస్తున్న అన్ని కరోనా వేరియంట్ కేసుల్లో 58.6%  కేసులకు  ఒమిక్రానే కారణమని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. దీని తర్వాత డెల్టా వేరియంట్ బాధితులు 41.1% మంది ఉన్నారని తెలిపింది.   
కాలిఫోర్నియాలో 50 లక్షల మందికి.. 
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా కాలిఫోర్నియాలో వైరస్ విజృంభిస్తోంది. ఈ స్టేట్​లో కేసులు50 లక్షలు దాటాయి. ఏ రాష్ట్రంలోనూ ఇంత భారీగా కేసులు నమోదుకాలే. మంగళవారం కాలిఫోర్నియాలో 86 వేల కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రాన్ని ‘హై ట్రాన్స్ మిషన్ ఏరియా’గా సీడీసీ ప్రకటించింది. న్యూయార్క్​లోనూ డైలీ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం ఇక్కడ 40,780 కొత్త కేసులు రికార్డ్ అయ్యాయి.