- కరోనాతో చనిపోయిన అమెరికన్ల సంఖ్య ఎనిమిది లక్షలు
- ప్రపంచవ్యాప్త మరణాల్లో 15 % ఇక్కడే
- మృతుల్లో 75 శాతం 65 ఏండ్లకు పైబడినోళ్లే
- టీకాలు వేస్కోపోవడంతోనే ఎక్కువ మరణాలు
వాషింగ్టన్: అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అక్కడ వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొన్నిరోజులుగా కేసులు, డెత్స్ పెరుగుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య ఇప్పటికే 5 కోట్లను దాటగా, మరణాల సంఖ్య 8 లక్షలను దాటింది. అమెరికాలో ఇప్పటివరకు 8,80,000 మంది చనిపోయారని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 15% ఇక్కడే రికార్డయ్యాయని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ రీసెర్చిలో వెల్లడైంది. ఈ సంఖ్య అట్లాంటా, సెయింట్ లూయిస్ సిటీల జనాభాకు సమానమని వర్సిటీ టీమ్ పేర్కొంది. అమెరికాలో చనిపోయినోళ్లలో 75% మంది 65 ఏండ్లకు పైబడిన వాళ్లేనని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ ఏజ్ గ్రూప్ లో ప్రతి 100 మందిలో ఒకరు కరోనాతో చనిపోయారని చెప్పింది. దేశంలో కొన్నిరోజులుగా సగటున రోజుకు దాదాపు వెయ్యిమంది చనిపోతున్నారని తెలిపింది. ఈ స్థాయిలో మరణాలు ఇంతకుముందు ఫిబ్రవరిలో నమోదయ్యాయని వెల్లడించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 53 లక్షల మంది కరోనాతో చనిపోయారు. అత్యధికంగా అమెరికాలోనే 8 లక్షల మంది మరణించారు. దీని తర్వాత బ్రెజిల్ లో 6 లక్షలకు పైగా, మన దేశంలో 4.75 లక్షలకు పైగా డెత్స్ నమోదయ్యాయి.
టీకాలు వేస్కోకపోవడంతోనే..
అమెరికాలో పోయినేడాది నుంచే వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. పోయినేడాది డిసెంబర్ లోనే టీకా అందుబాటులోకి రాగా.. ఆ టైమ్ లో 3 లక్షల డెత్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఈ ఏడాది జూన్ నాటికి 6 లక్షలకు, అక్టోబర్ నాటికి 7 లక్షలకు పెరిగాయి. ఇప్పుడు 8 లక్షలకు పైగా చేరాయి. అంటే కేవలం 2 నెలల వ్యవధిలోనే లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. జనం టీకాలు వేస్కోకపోవడంతోనే అమెరికాలో ఇలాంటి పరిస్థితి నెలకొందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయినోళ్లలో ఎక్కువ మంది టీకా వేసుకోన్నోళ్లే ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ స్లోగా జరుగుతోందని.. దాన్ని స్పీడప్ చేయాలని, ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే వైరస్ ను కట్టడి చేయగలమని చెప్తున్నారు. కాగా, అమెరికాలో ఇప్పటి వరకు కేవలం 60% మందే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నారు.
