అమెరికాకు ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి సంఖ్య 20 లక్షల నుంచి ఏకంగా 5.15 లక్షలకు తగ్గడం కార్మిక శక్తిపై తీవ్రమైన ప్రభావం చూపనుందని ఫెడరల్ రిజర్వ్ హెచ్చరించింది. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వలసదారుల సంఖ్య తగ్గిందని ఫెడ్ తన రిపోర్టులో పేర్కొంది. 2024లో అమెరికాలోకి ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వలసదారుల సంఖ్య 22 లక్షలుగా ఉండగా.. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక 2025లో ఈ సంఖ్య 5.15 లక్షలకు పడిపోయింది. దీనికి ట్రంప్ ప్రభుత్వ కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాలు, సరిహద్దు నియంత్రణలు, బలవంతపు దేశబహిష్కరణలు కారణాలుగా ఉన్నట్లు వెల్లడైంది.
ఇప్పటికే వేలాది వలసదారులు ఇప్పటికే అమెరికా కార్మిక శక్తిని విడిచిపోతున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, నిర్మాణ రంగం, హోం హెల్త్‌కేర్ వంటి రంగాలు దీని కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. వలస కార్మికులు తగ్గిపోవడం వల్ల పనివాళ్ల కొరత, జీతాల పెరుగుదల, ఉద్యోగ సృష్టిలో మందగమనాన్ని కలిగిస్తోంది. కొన్ని పరిశ్రమల్లో వలసదారుల శాతం 34% దాటితే, మరికొన్నింటిలో 60% వరకు ఉంది.
పనిచేసే వయస్సు గల జనాభా సంఖ్య తగ్గటం, అమెరికాకు తగ్గిన ఇమ్మిగ్రెంట్ల సంఖ్య, యూఎస్ ఆర్థిక ఉత్పత్తిలో తగ్గుదల కలగొచ్చని వెల్లడైంది. పింఛను, మెడికేర్ వంటి సామాజిక కార్యక్రమాలకు పన్నుల ఆదాయం తగ్గిపోవచ్చు. అంతేకాక ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో ఇబ్బందులు వచ్చినప్పుడు కంపెనీలు వేతనాలను గణనీయంగా పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేయొచ్చని తెలుస్తోంది. వలసదారుల ద్వారా కేవలం వచ్చేది ఆదాయ పోషణ మాత్రమే కాదు.. అమెరికాలో కొత్త ఇనోవేషన్, విద్య, పరిశ్రమలను రూపొందించడంలో కీలకపాత్ర వారిదిగా ఉంది. భవిష్యత్తులో వీటిపై ఎక్కువగా ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది.
ఫెడరల్ రిజర్వ్, ప్యూవ్ రీసెర్చ్ సెంటర్ వంటి సంస్థలు, వలస నియంత్రణలు ఇలాగే కొనసాగితే.. అమెరికా దీర్ఘకాల వృద్ధికి ఆటంకం ఉంటుందని హెచ్చరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ కల్పనలో మందగమనం, ఆర్థిక వ్యవస్థలో అస్థిరత చోటుచేసుకునే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.ఈ పరిస్థితులు అమెరికా భవిష్యత్ అభివృద్ధికి గణనీయమైన సవాలు అని నిపుణులు పేర్కొంటున్నారు.
