అమెరికా, ఇరాన్ చర్చలు విఫలం.. 21 గంటల పాటు మీటింగ్.. రెండు అంశాలపై కుదరని ఏకాభిప్రాయం!

అమెరికా, ఇరాన్ చర్చలు విఫలం.. 21 గంటల పాటు మీటింగ్.. రెండు అంశాలపై కుదరని ఏకాభిప్రాయం!
  • పరస్పరం ఆరోపణలు చేసుకున్న అమెరికా, ఇరాన్
  • అమెరికా అనుచిత డిమాండ్లే కారణం: ఘాలిబాఫ్ బృందం
  • అగ్రరాజ్య ధోరణి వల్లే చర్చలు నిలిచిపోయాయని ఆరోపణ
  • డీల్ కుదురుతుందనే నమ్మకం తమకు ముందునుంచీ లేదని వెల్లడి
  • ఫైనల్ గా ‘ది బెస్ట్ ఆఫర్’ ఇచ్చామన్న అమెరికా బృందం
  • ఇరాన్​కు బ్యాడ్ న్యూస్ అంటూ జేడీ వాన్స్ కామెంట్
  • అణ్వాయుధ దేశంగా ఇరాన్​ను 
  • ఎన్నటికీ మారనివ్వబోమని వార్నింగ్​

ఇస్లామాబాద్, టెహ్రాన్, వాషింగ్టన్:పశ్చిమాసియాలో శాంతి కోసం చేపట్టిన చర్చలు విఫలమయ్యాయి. సుదీర్ఘంగా దాదాపు 21 గంటల పాటు జరిగిన చర్చల్లో చివరకు ప్రతిష్ఠంభన నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య యుద్ధానికి పూర్తిస్థాయిలో విరమణ ప్రకటించడం, ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని తెరిపించడం ప్రధాన లక్ష్యాలుగా అమెరికా ఈ చర్చల్లో పాల్గొంది. అగ్రరాజ్యం తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన బృందంతో పాల్గొనగా.. ఇరాన్ తరఫు నుంచి పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకర్ ఘాలిబాఫ్​ బృందం హాజరైంది. ఇరు దేశాల మధ్య పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్​ మీడియేషన్ జరిపారు. 

చర్చలు సుదీర్ఘంగా సాగినా ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, ఒప్పందం కుదరకుండానే తాము వెళ్లిపోతున్నామని జేడీ వాన్స్ ప్రకటించారు. ఇది ఇరాన్​కే దుర్వార్త అని హెచ్చరించారు. ఈ చర్చల్లో ప్రధానంగా అణ్వాయుధ తయారీ, హార్మూజ్ విషయంలో ఇరు దేశాల్లో ఏ ఒక్కటీ వెనక్కి తగ్గలేదని సమాచారం. అమెరికా డిమాండ్లు అనుచితమని ఘాలిబాఫ్ ​బృందం ఆరోపించింది. శాంతి చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడానికి కారణం అమెరికా అనుచిత వైఖరేనని మండిపడింది. 

తొలి విడత చర్చల్లోనే డీల్ కుదురుతుందని తమ బృందంలో ఎవరూ ఆశించలేదని, తొలి భేటీలోనే ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదరడం అరుదని పేర్కొన్నారు. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలపై ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఐబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘ఇరాన్ జాతీయ ప్రయోజనాలను కాపాడటం కోసం తమ ప్రతినిధి బృందం 21 గంటల పాటు నిరంతరాయంగా చర్చలు జరిపింది. తమ బృందం రకరకాల ప్రతిపాదనలు చేసినప్పటికీ, అమెరికా వైపు నుంచి వచ్చిన అహేతుక డిమాండ్లే చర్చల పురోగతిని అడ్డుకున్నాయి. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి’ అని పేర్కొంది. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో పాటు ప్రాంతీయ మిత్రదేశాలతో తమ సంప్రదింపులు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ సెమీ-అఫీషియల్ వార్తా సంస్థ ‘తస్నిమ్’ కథనం ప్రకారం.. ‘హోర్ముజ్ జలసంధి’, అణు పదార్థాల తొలగింపు వంటి విషయాల్లో యుద్ధం ద్వారా పొందలేని రాయితీలను అమెరికా చర్చల ద్వారా కోరిందని పేర్కొంది.

  • ట్రంప్‌‌‌‌‌‌‌‌తో 12సార్లు మాట్లాడాం: జేడీ వాన్స్

ఇరాన్‌‌‌‌‌‌‌‌తో 21 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన చర్చల సమయంలో తాము అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌‌‌‌‌‌‌తో నిరంతరం సంప్రదింపులు జరిపామని జేడీ వాన్స్ తెలిపారు. ప్రెసిడెంట్ తో సుమారు 12 లేదా అంతకంటే ఎక్కువసార్లు ఫోన్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడామని చెప్పారు. అడ్మిరల్ బ్రాడ్ కూపర్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్‌‌‌‌‌‌‌‌, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌తో కూడా చర్చించామని పేర్కొన్నారు.

  • చర్చల్లో పాల్గొన్న ప్రతినిధుల బృందం ఇదే..

1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా -ఇరాన్ మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు ఇవే కావడం గమనార్హం. జేడీ వాన్స్, స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్‌‌‌‌‌‌‌‌కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ అమెరికా బృందానికి నాయకత్వం వహించగా, ఇరాన్ తరఫున పార్లమెంటరీ స్పీకర్ మహ్మద్ బాకర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ సభ్యుల బృందం పాల్గొంది.

  • మేం బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చినా.. ఇరాన్‌‌‌‌‌‌‌‌ ఒప్పుకోలే: వాన్స్

‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనల మేరకు ఇరాన్​కు మేం అత్యుత్తమ ఆఫర్ ఇచ్చాం.. కానీ, ఇరాన్ అత్యాశతో వ్యవహరిస్తోంది. అందుకే డీల్ కుదరలేదు’ అంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్​తో జరిగిన శాంతి చర్చల నుంచి అమెరికా అర్ధాంతరంగా వైదొలిగింది. సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పటికీ ఇరాన్ అత్యాశ కారణంగా ఒప్పందం కుదర్చుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చిందన్నారు. 

మీడియాతో జేడీ వాన్స్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తూ ఈ సమావేశంలో ఎలాంటి డీల్‌‌‌‌‌‌‌‌ కుదరలేదన్నారు. అమెరికా పెట్టిన కండిషన్లను ఇరాన్‌‌‌‌‌‌‌‌ అంగీకరించలేదని తెలిపారు. చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో తిరిగి వెళ్తున్నామని చెప్పారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో ఇరాన్‌‌‌‌‌‌‌‌ న్యూక్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెపన్స్‌‌‌‌‌‌‌‌ తయారు చేసుకోవడం, సమకూర్చుకోవడం వంటి ప్రయత్నాలు చేయబోమనే హామీని అమెరికా కోరుతోందని తెలిపారు. అమెరికా ‘ఫైనల్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఇచ్చినప్పటికీ ఇరాన్‌‌‌‌‌‌‌‌ ఒప్పుకోలేదన్నారు. 

ఇది అమెరికా కంటే ఇరాన్‌‌‌‌‌‌‌‌కే ఎక్కువ నష్టం కలిగించే విషయమని చెప్పారు. ‘‘మేము పెట్టిన రెడ్‌‌‌‌‌‌‌‌ లైన్స్‌‌‌‌‌‌‌‌ ఏంటో.. ఏయే అంశాల్లో వారికి అనుకూలంగా ఉండాలనుకుంటున్నామో, వేటిని వ్యతిరేకిస్తున్నామో చెప్పినం. వారు మా షరతులను అంగీకరించేందుకు ఇష్టపడలేదు. ఇరాన్ ను ఎన్నటికీ అణ్వాయుధ దేశంగా మారనివ్వబోం” అని వాన్స్‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేశారు.