- మిస్సింగ్‌కు ముందు ‘7700’ డిస్ట్రెస్ సిగ్నల్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. యూఎస్ మిలిటరీ విమానాలకు గాల్లోనే ఇంధనం సరఫరా చేసే బోయింగ్ కేసీ 135 స్ట్రాటో ట్యాంకర్ ఖతార్ గగనతలంలో గల్లంతయింది. గల్ఫ్ ఆఫ్ పర్షియన్ లో వెళ్తుండగా ఈ విమానం అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ ‘7700’ అంటూ డిస్ట్రెస్ సిగ్నల్ పంపిందని ఫ్లైట్ రాడార్ 24 డేటా వెల్లడించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్ నుంచి ఈ విమానం టేకాఫ్ అయింది.
ఖతార్ గగనతలంలోకి ప్రవేశించాక సిగ్నల్ కోల్పోయింది. ప్రస్తుతం ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో మిలిటరీ ఆపరేషన్ల కోసం ఈ విమానాన్ని వాడుతున్నారు. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా తెలిపిన సమాచారం ప్రకారం ఈ విమానం కాసేపు గాల్లో సర్క్యులర్ ప్యాటర్న్ లో తిరిగింది. తర్వాత ల్యాండింగ్ కోసం ప్రయత్నించింది. అయితే, ల్యాండింగ్ కోసం ఎందుకు ప్రయత్నించిందో కచ్చితంగా తెలియరాలేదు. కాగా, సైనిక కార్యకలాపాల కోసం కేసీ 135 స్ట్రాటోట్యాంకర్ ను ఉపయోగిస్తారు. ముఖ్యంగా విమానాలు గాల్లో ఉన్నపుడు ఇది ఇంధనం నింపుతుంది. ఫైటర్ జెట్లు, బాంబర్లు, ఇతర మిలిటరీ విమానాల్లో గాల్లోనే ఈ స్ట్రాటో ట్యాంకర్ ఇంధనం నింపి సుదీర్ఘకాలం ప్రయాణించేందుకు తోడ్పడుతుంది.
మా నౌకలపై దాడి చేస్తే.. అంతు చూస్తాం: ట్రంప్
హార్మూజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలకు ఎస్కార్టుగా వెళ్తున్న తమ షిప్పులపై దాడిచేస్తే, ఇరాన్ ను నామరూపాలు లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే కొన్ని నౌకలపై ఇరాన్ దాడి చేసిందని తన ట్రూత్ సోషల్ వేదికలో ఆయన ఫైర్ అయ్యారు. అందులో సౌత్ కొరియా కార్గో వెసెల్ తో పాటు మరికొన్ని షిప్పులు ఉన్నాయని తెలిపారు. అయితే, ఇరాన్ కు చెందిన ఏడు స్మాల్ బోట్లను తమ దేశ బలగాలు నాశనం చేశాయని చెప్పారు. హార్మూజ్ జలసంధిలో తాము చేపట్టిన ఆపరేషన్ ‘ప్రాజెక్ట్ ఫ్రీడం’ లో చేరాలని దక్షిణ కొరియాను ఆయన కోరారు. కాగా.. తమను రెచ్చగొట్టవద్దని అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ని ఇరాన్ కూడా హెచ్చరించింది. తమను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
వైట్ హౌస్ బయట కాల్పులు.. కాసేపు లాక్ డౌన్
వైట్ హౌస్ బయట కాల్పులు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగుడు తుపాకీతో సోమవారం మధ్యాహ్నం వైట్ హౌస్ కాంప్లెక్స్ లోకి అడుగుపెట్టి అక్కడున్న ఆఫీసర్ల వైపు కాల్పులు జరిపాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే అప్రమత్తమై దుండగుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతనికి గాయాలయ్యాయి. వెంటనే అతడిని హాస్పిటల్ కు తరలించి ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నామని సీక్రెట్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ మాట్ క్విన్ తెలిపారు.
