రణరంగంగా మారిన హార్మూజ్.. యూఏఈ ట్యాంకర్లపై దాడికి ప్రతీకారంగా ఇరాన్‎పై విరుచుకుపడ్డ అమెరికా

రణరంగంగా మారిన హార్మూజ్.. యూఏఈ ట్యాంకర్లపై దాడికి ప్రతీకారంగా ఇరాన్‎పై విరుచుకుపడ్డ అమెరికా

వాషింగ్టన్: ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటిదైనా హార్మూ్జ్ జలసంధి రణరంగంగా మారింది. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు ప్రతిదాడులతో హార్మూజ్ జలసంధిలో మరోసారి యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తోన్న యూఏఈ ఆయిల్ ట్యాంకర్లపై ప్రాథమిక శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఇరాన్ మిస్సైల్ దాడులు చేయడంపై అమెరికా కన్నెర్ర జేసింది. ఈ క్రమంలోనే యూఏఈ ట్యాంకర్లపై దాడికి ప్రతీకారంగా ఇరాన్‎పై అమెరికా విరుచుకుపడింది.

ఇరాన్ మిస్సైల్ లాంఛ్ సైట్స్, రాడార్ వ్యవస్థలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్‌పై అమెరికా సైన్యం మరో విడత దాడులు ప్రారంభించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ దాడుల్లో ఇరాన్ బలగాలు భారీ నష్టాన్ని చవిచూస్తాయని హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధిలో అమాయక పౌరులు, వాణిజ్య నౌకలపై దాడి చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తామని తెలిపింది. 

ఏం జరుగుతుందో చూద్దాం: ట్రంప్

ఇరాన్‎పై అమెరికన్ ఆర్మీ చేపట్టిన ఫ్రెష్ అటాక్స్‎పై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇది ఇరాన్ పై మరో ప్రధాన దాడి అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‎ను చాలా గట్టిగా దెబ్బ తీస్తున్నామని.. వారి దాడి సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నామన్నారు. ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయని.. చివరకు ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు. హార్మూజ్ జలసంధిని నియంత్రణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. 

యూఏఈ చమురు ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్ అటాక్: 

హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తోన్న యూఏఈకి చెందిన రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఓ భారతీయ నావికుడు మరణించగా.. ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ దాడులను యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

హోర్ముజ్ జలసంధిలోని ఒమన్ జలాల్లో తమ దేశానికి చెందిన మొంబాసా, అల్ బహియా అనే రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్‌ క్రూయిజ్ క్షిపణులు దాడి చేశాయని యూఏఈ తెలిపింది. మొంబాసా ట్యాంకర్‌పై జరిగిన దాడిలో ఒక భారతీయ సిబ్బంది మరణించగా.. ఎనిమిది మంది గాయపడ్డారని వెల్లడించింది. గాయపడ్డవారిలో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రేనియన్ జాతీయులు ఉన్నట్లు తెలిపింది. 

మిస్సైల్ దాడుల కారణంగా రెండు ట్యాంకర్లలో మంటలు చెలరేగి భారీగా నష్టం వాటిల్లింది. ఈ దాడిని యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాల తీవ్ర ఉల్లంఘన అని పేర్కొంది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందించే హక్కు తమకు ఉందని హెచ్చరించింది. యూఏఈ సార్వభౌమత్వం, భద్రత, సముద్ర ప్రయోజనాలను కాపాడుకోవడానికి దేశం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని తేల్చి చెప్పింది.