- సెక్షన్ 301 కింద వాణిజ్య పద్ధతులపై విచారణ ప్రారంభం
వాషింగ్టన్: ఇంటర్నేషనల్ వాణిజ్య రంగంపై అమెరికా ప్రభుత్వం మరోసారి కఠిన నిర్ణయాలకు సిద్ధమైంది. భారత్, చైనా, బంగ్లాదేశ్ వంటి తమ16 కీలక ట్రేడ్ పార్టనర్ దేశాలు అక్రమ వాణిజ్య పద్ధతులను అనుసరిస్తున్నాయని ఆరోపిస్తూ ఆయా దేశాలపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభించింది. ట్రేడ్ యాక్ట్ 1974 సెక్షన్ 301 కింద ఈ విచారణను చేపట్టింది.
యాక్ట్ ప్రకారం..వేరే దేశాలు అమెరికా ఎగుమతులకు అడ్డంకులు సృష్టించినా, అమెరికా కంపెనీల పట్ల వివక్ష చూపినా, వారిపై శిక్షతో కూడిన చర్యలు తీసుకునే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. అంతేగాక, అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే దేశాలపై సుంకాలు, ఇతర ఆంక్షలు కూడా విధించవచ్చు.
అసలు దర్యాప్తు ఎందుకంటే..
గత నెలలో అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను చట్టవిరుద్ధం అని పేర్కొంటూ కొట్టివేసింది. దాంతో కోర్టు కొట్టివేయలేని మరో బలమైన చట్టం (సెక్షన్ 301) ద్వారా మళ్లీ టారీఫ్ లను తీసుకురావాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత..ఆయన వెంటనే సెక్షన్ 122 కింద కేవలం 150 రోజుల వరకు మాత్రమే చెల్లుబాటు అయ్యేలా 10% తాత్కాలిక పన్ను విధించారు. ఈ గడువు జూలైలో ముగిసిపోతుంది.
ఆలోపు సెక్షన్ 301ద్వారా ఇతర దేశాలు అనుసరిస్తున్న అక్రమ వాణిజ్య పద్ధతులపై విచారణను పూర్తి చేసి, వాటిపై శాశ్వత పన్నులు వేయాలని అమెరికా సర్కార్ ప్లాన్ చేస్తున్నది. ఇతర దేశాలు అవసరానికి మించి వస్తువులను తయారు చేసి తమ దేశంలో తక్కువ ధరలకు అమ్ముతున్నాయని అమెరికా భావిస్తున్నది. దీనివల్ల అమెరికాలోని కంపెనీలు దెబ్బతింటుండంతో ఈ అక్రమ పద్ధతులను అరికట్టి అమెరికా తయారీ రంగాన్ని కాపాడటమే దర్యాప్తు లక్ష్యంగా తెలుస్తున్నది.
విచారణ పరిధిలోని అంశాలివే..
యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమీసన్ గ్రీర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విచారణ ప్రధానంగా తన16 ట్రేడ్ పార్టనర్ దేశాల్లోని తయారీ రంగాల్లో ఉన్న అధిక ఉత్పత్తి(ఎక్సెస్ కెపాసిటీ ) సామర్థ్యంపై దృష్టి సారిస్తుంది. ఆయా దేశాలు వారి కంపెనీలకు ఇచ్చే సబ్సిడీలు ఇవ్వడం, తక్కువ ధరకే వస్తువులు అమ్మేలా ప్రోత్సహించడం, అమెరికా కంపెనీల టెక్నాలజీని, ఫార్ములాలను కాపీ కొట్టడడాన్ని అక్రమ వాణిజ్య పద్ధతులుగా పరిగణిస్తారు.
కార్మికులను బంధించి అతి తక్కువ జీతాలతో పనిచేయించి వస్తువులను తయారు చేయిస్తున్న సుమారు 60 దేశాల నుంచి దిగుమతులపై నిషేధం విధించేందుకు మరో విచారణ జరగుతుందని గ్రీర్ ప్రకటించారు. దర్యాప్తు జరిపే దేశాల జాబితాలో భారత్, చైనా, ఈయూ, జపాన్, సౌత్ కొరియా, మెక్సికో, తైవాన్, వియత్నాం, సింగపూర్ వంటి దేశాలు ఉన్నాయి. అమెరికా తయారీ రంగాన్ని రక్షించుకోవడంతోపాటు ట్రేడ్ లోటును తగ్గించడానికి తాము అన్ని రకాల మార్గాలు ఉపయోగిస్తామని గ్రీర్ స్పష్టం చేశారు.
