హిట్లర్, బైడెన్ ఇద్దరూ ఒక్కటే

హిట్లర్, బైడెన్ ఇద్దరూ ఒక్కటే
  • హిట్లర్, బైడెన్ ఇద్దరూ ఒక్కటే
  • ఇద్దరూ వాళ్ల చర్యను సమర్థించుకునేవారే
  • డెమోక్రటిక్ పార్టీ మాజీ లీడర్ తులసీ గబార్డ్

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, జర్మనీ దివంగత నియంత అడాల్ఫ్ హిట్లర్ ఇద్దరూ ఒక్కటే అని డెమోక్రటిక్ పార్టీ మాజీ లీడర్ తులసీ గబార్డ్ అన్నారు. ఆరిజోనా గవర్నర్ పదవికి పోటీపడుతున్న కారీ లేక్ తరఫున తులసీ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా మాంచెస్టర్ టౌన్​లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బైడెన్, హిట్లర్ ఇద్దరిదీ ఒకేరకమైన మనస్తత్వం అని, ఇద్దరూ తమ చర్యలను సమర్థించుకునేవారే అని పేర్కొన్నారు. ‘‘జర్మనీకి ఏది ఉత్తమమో అదే చేస్తున్నానని హిట్లర్ అనుకునేవారు. బైడెన్ కూడా అలాగే అనుకుంటున్నారు. ఇద్దరిదీ హింసాత్మక ఆలోచనా ధోరణి. గత ప్రెసిడెంట్ ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ ను సమర్థించిన వారు, తనకు ఓటు వేయని వారిని అతివాదులని బైడెన్ అన్నారు.

తనకు ఓటువేయని వారు ప్రజాస్వామ్యానికి ముప్పు అని కామెంట్​ చేశారు. తన చర్యను సమర్థించుకోవడానికి హిట్లర్ కూడా ఇలానే అనుకునేవారు” అని గబార్డ్  పేర్కొన్నారు. దేశంలో పౌరుల మధ్య మరిన్ని విభేదాలు సృష్టిస్తున్నారంటూ బైడెన్​పై ఆమె మండిపడ్డారు. అలాగే ఉక్రెయిన్​పై రష్యా దురాక్రమణను కూడా ఆమె ఖండించారు. కాగా, నిరుడు ప్రతినిధుల సభ నుంచి ఆమె రిటైర్ అయ్యారు. డెమోక్రటిక్ పార్టీకి కూడా గత వారం రాజీనామా చేశారు. పార్టీలో ఉన్నవారు యుద్ధాన్ని కోరుకునే ఉన్నత వర్గంగా తయారయ్యారని ఆమె విమర్శించారు. 2013లో హవాయ్ నుంచి ప్రతినిధుల సభకు హిందూ అమెరికన్ తులసీ గబార్డ్​ ఎన్నికయ్యారు.