రష్యాకు షాక్..ఉక్రెయిన్లో బైడెన్ ఆకస్మిక పర్యటన

రష్యాకు షాక్..ఉక్రెయిన్లో బైడెన్ ఆకస్మిక  పర్యటన

రష్యాకు షాకిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్లో ఆకస్మికంగా పర్యటించారు. కీవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో బైడెన్  సమావేశమయ్యారు. రష్యా ఉక్రేయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల  స్మారకం వద్ద నివాళులర్పించారు. రష్యా--ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏడాది అయిన నేపథ్యంలో బైడెన్ అకస్మాత్తుగా ఉక్రెయిన్‌లో పర్యటించడం  ప్రాధాన్యత సంతరించుకుంది. 

జెలెన్తో కీలక చర్చలు

సోమవారం ఉదయం  ఉక్రెయిన్ రాజధాని కీవ్కు జో బైడెన్ చేరుకున్నారు. పోలండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ డుడాతో సమావేశమయ్యేందుకు వెళ్తూ.. మధ్యలో కీవ్లో దిగారు. అయితే  సోమవారం పొద్దున్నే ఉక్రేయిన్ రాజధాని కీవ్ సహా దేశవ్యాప్తంగా అధికారులు ఎయిర్ అలర్ట్ జారీ చేశారు. దీంతో  కీలక నేత వస్తున్నారన్న  వార్తలు వచ్చాయి.  అటు తన పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో బైడెన్ పలు అంశాలపై చర్చలు జరిపారు.  సుమారు 500 మిలియన్ డాలర్ల మిలిటరీ సహాయ ప్యాకేజీని ఉక్రెయిన్కు అందజేయనున్నట్లు బైడెన్ తెలిపారు. 

రష్యా పెద్ద తప్పిదం చేసింది..

రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సమయంలో ఉక్రెయిన్ బలహీనమైందని అంతా అనుకున్నారు. ఉక్రెయిన్ పై రష్యా ఈజీగా గెలుస్తుందని భావించారు. కానీ ఆ తర్వాత అందరికి అర్థమైందేందంటే రష్యా పెద్ద తప్పిదం చేసిందని... రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏడాది అయింది. ఈ ఏడాదిలో అట్లాంటిక్, పసిఫిక్ పరిధిలోని అన్ని దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలిచాయి. అందుకే అమెరికా ఓ సంకీర్ణ కూటమి ఏర్పాటు చేసింది..అని  బైడెన్ ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ ప్రజాస్వామ్యం, సార్వహభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత పట్ల అమెరికా తిరుగులేని నిబద్ధతను చూపుతోందని బైడెన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.