న్యూఢిల్లీ: ముంబై విమానాశ్రయం నుంచి కార్గో కార్యకలాపాలను కొత్తగా నిర్మించిన నవీ ముంబై విమానాశ్రయానికి తరలించాలన్న అదానీ గ్రూప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా ప్రభుత్వం కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఫెడెక్స్ వంటి అమెరికన్ కార్గో సంస్థలను బలవంతంగా నవీ ముంబైకి తరలించడం ఒప్పందాలకు విరుద్ధమని యూఎస్ రవాణా శాఖ (డీఓటీ) స్పష్టం చేసింది. అమెరికా సంస్థల ప్రయోజనాలకు విరుద్ధంగా తరలిస్తే తాము కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ప్రస్తుత ముంబై విమానాశ్రయంలో టాక్సీ వేలు, ఇతర మౌలిక సదుపాయాల మరమ్మతులు జరుగుతున్నాయని అదానీ గ్రూప్ ప్రతినిధులు చెబుతున్నారు. అందుకే అంతర్జాతీయ కార్గో సర్వీసులను నవీ ముంబైకి మార్చాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్రస్తుతం ముంబై విమానాశ్రయం నుంచి సేవలు అందిస్తున్న ఏకైక అమెరికన్ కార్గో సంస్థ ఫెడెక్స్ మాత్రమే! అమెరికా అధికారులు అదానీ గ్రూప్ వాదనతో ఏకీభవించడం లేదు. కొత్త విమానాశ్రయంలో విమాన రాకపోకలు పెంచడానికే అదానీ గ్రూప్ ఈ ఎత్తుగడ వేసిందని అనుమానిస్తున్నారు.

