ఉస్మాన్ నగర్ జంట రిజర్వాయర్లు రెడీ ..ఈ వారంలోనే ప్రారంభానికి సిద్ధం

ఉస్మాన్ నగర్ జంట రిజర్వాయర్లు రెడీ ..ఈ వారంలోనే ప్రారంభానికి సిద్ధం
  • ఇక్కడి నుంచి పటాన్​చెరు  ప్రాంతాలకు నీటి సరఫరా
  •  ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్– 2లో పూర్తయిన రిజర్వాయర్లు  

హైదరాబాద్​సిటీ, వెలుగు : ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్-2లో భాగంగా పటాన్​చెరులోని ఉస్మాన్ నగర్ లో నిర్మించిన జంట రిజర్వాయర్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఔటర్ పరిధిలో విస్తరించిన గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటి సరఫరా చేయడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టును ఈ వారంలోనే ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

4ఎంఎల్, 2ఎంఎల్ కెపాసిటీతో నిర్మించిన ఈ జంట రిజర్వాయర్లు ప్రారంభమైతే పటాన్​చెరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. గజ్వేల్​దాని పరిసర ప్రాంతాలకు తాగునీటి కోసం మిషన్​భగీరథకు ఇస్తున్న 15 ఎంజీడీలను తిరిగి వాటర్​బోర్డు వినియోగించుకునేందుకు అవకాశం కలిగింది. ఉస్మాన్​నగర్​పరిధిలోని ఈ రిజర్వాయర్ల నుంచి తెల్లాపూర్ మున్సిపాలిటీకి తాగునీటిని అందించనున్నారు. డిస్ట్రిబ్యూషన్ లైన్లు కూడా పూర్తయినట్టు అధికారులు తెలిపారు.  ఇప్పటికే రిజర్వాయర్ల ఇన్ లెట్, అవుట్ లెట్ నిర్మాణం పూర్తి కావడంతో ట్రయల్​రన్​ కూడా నిర్వహించారు. 

మోడల్​రిజర్వాయర్లుగా 

ఉస్మాన్ నగర్ లో నిర్మించిన ఈ జంట రిజర్వాయర్లను మోడల్​రిజర్వాయర్లుగా రూపుదిద్దేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు సర్వీస్ ఏరియాలకు సంబంధించిన వాటర్ ఆడిట్ ను ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా ఈ రిజర్వాయర్ల నుంచి సరఫరా చేస్తున్న ప్రతి చుక్కనూ లెక్క కట్టేలాగా ఫ్లో మీటర్ ను పెట్టి, చివరి వినియోగదారుడి వద్ద కూడా మీటర్ రీడింగ్ సరిపోయేలా లెక్క కట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

తద్వారా ట్రాన్స్ మిషన్ లాస్ ఎంత ఉందన్నది కూడా తెలుస్తుందని అధికారులు తెలిపారు. ఈ జంట రిజర్వాయర్ల పరిధిలో ప్రయోగాత్మకంగా డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ పై స్మార్ట్ వాల్వ్ టెక్నాల‌‌‌‌జీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ.30 కోట్లతో నిర్మించిన ఈ రెండు రిజర్వాయర్లు అందుబాటులోకి వస్తే దాదాపు లక్ష మంది జనాభాకు శుద్ధి చేసిన తాగునీరు లభిస్తుందని అధికారులు తెలిపారు.