నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంతో తీవ్ర చిక్కుల్లో పడిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. UGC NET పరీక్షల వాయిదాతో మరో వివాదంలో చిక్కుకుంది. యూజీసీ పేపర్ సెట్ చేసే క్రమంలో సంబంధిత నిపుణులు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పై ఆధారపడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఏఐ వినియోగించి సెట్ చేసిన పేపర్ లో కొన్ని ప్రశ్నలకు నిపుణుల దగ్గర సమాధానాలు లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం.
ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లను రద్దు చేయడంతో ఈ వివాదం బయటకు వచ్చింది. ఎన్టీఏ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంపై ఎన్టీఏలోని కొందరు అధికారులు వెల్లడించిన ఆధారాలు దుమారం రేపుతున్నాయి. అయితే పరీక్షా పత్రాల తయారీలో ఏఐ వాడకం అనే ఆరోపణలను NTA ఖండించింది.
ఎన్టీఏలో ఉన్న కొందరు అధికారులు తమ పేర్లు వెల్లడించకుండా.. ఎన్టీఏలో ఏం జరుగుతుందో చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. UGC NET పేపరు తయారీలోనే కాకుండా.. ట్రాన్స్ లేషన్స్ కు కూడా ఏఐ వాడినట్లు వారు వెల్లడించారు.
ఎన్టీఏ కొన్ని ఫలితాలను ప్రకటించలేమని చెప్పడంతో ఈ వివాదంతెరపైకి వచ్చింది. పరీక్ష పత్రాల తయారీలో కొన్ని ప్రశ్నలను తాత్కాలిక పద్ధతిలో తయారు చేశారని చెప్పడంతో ఈ వివాదం మొదలైంది. తాత్కాలిక పద్ధతిలో పేపర్ తయారు చేసినట్లు చెప్పిన అధికారులతో చర్చలు జరిపామని.. తాత్కాలిక పద్ధతి అంటే ఏంటని ప్రశ్నించినప్పుడు సమాధానం లేదని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు వెల్లడించారు.
ప్రతి పేపర్ ను నలుగురు లేదా ఐదుగురితో కూడిన ప్యానెల్ తయారు చేస్తుందని.. ఒక వేళ ప్యానెల్ ఉంటే... చాలా ప్రశ్నలు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచి ఎందుకు ఎంచుకున్నట్లు అని ప్రశ్నించారు. వాళ్లు డిజైన్ చేసిన ప్రశ్నలకు ఎక్సామినర్ల దగ్గర సమాధానం లేకపోవడమేంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే ఎన్టీఏ యూజీసీ పేపర్ తయారీలో ఏఐ వాడకం అని ఆరోపణలను ఎన్టీఏ డైరెక్టర్ అభిషేక్ సింగ్ తప్పుపట్టారు. పేపర్ సెట్ చేసిన తర్వాత హ్యూమన్ రివ్యూ (నిపుణుల పరిశీలన) ఉన్నట్లు చెప్పారు. అలాంటప్పుడు తప్పులు ఎలా దొర్లాయి అనే ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేకపోవడం గమనార్హం.
పేపర్ రద్దుకు, రీ టెస్టుకు విద్యాశాఖ మద్ధతు ఇచ్చినట్లు చెబుతున్నారు. జులై చివర్లో లేదా ఆగస్ట్ మొదటి వారంలో పరీక్షలు నిర్వహించేందుకు ప్లాన్ చేసినా.. కనీసం ఆరు వారాలపాటు వెయిట్ చేసి.. 87 పేపర్లలో 84 పేపర్లకు తీరా ప్రొవిజినల్ కీ విడుదల చేశాక పేపర్ల రద్దను ప్రకటించారు.
ముఖ్యంగా సోషియాలజీ పరీక్ష పత్రంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన స్కాలర్ల పేర్లను కూడా తప్పుగా రాయడం, టెర్మినాలజీలో తప్పులు, ట్రాన్సిలేషన్స్ లో తప్పులు, ప్రశ్నల్లో తప్పులు.. ఇలా మొత్తం గందరగోళానికి గురిచేసినట్లు సీనియర్లు తెలిపారు. కొన్ని సిలబస్ కు సంబంధం లేకుండా ప్రశ్నలు ఉండటం మరో సమస్య. ఇక జార్జ్ రిట్జర్ పేరును పుట్చర్ అని.. టాల్కాట్ పార్సన్స్ పేరు పర్సో, జీఎస్ ఘురే పేరును ఘునే అంటూ తప్పుల తడకగా ఇవ్వడం తీవ్ర విమర్శలకు కారణమైంది.
మరోవైపు ఇంగ్లీష్ పేపర్ లో సగానికి సగం గత పరీక్షల నుంచే రిపీట్ అయినట్లు విమర్శలున్నాయి. మొత్తం 150 ప్రశ్నల్లో 67 క్వశ్చన్స్ పునరావృతం కావడంపై ఎన్టీఏ నిర్లక్ష్యం ఏంటో తెలుస్తుందని విమర్శలకు దుగుతున్నారు. కామర్స్ పరీక్ష పత్రంలో కూడా అదే సమస్య ఉండటం గమనార్హం.
