- మీడియం పేస్ ప్రాక్టీస్ చేశా
- సచిన్‌ను చూసి బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టా
- షేన్ వార్న్ ఓ మ్యాస్ట్రో: రవిచంద్రన్ అశ్విన్
బెంగళూరు: లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ లాగా పేస్ ఆల్‌రౌండర్ కావాలని కెరీర్ ప్రారంభంలో అనుకున్నట్లు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. అందుకే చిన్నప్పుడు మీడియం పేస్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ పై ఎక్కువగా దృ-ష్టి పెట్టినట్లు వెల్లడించాడు. అలాంటిది స్పిన్నర్‌గా మారి కపిల్ కంటే ఎక్కువ వికెట్లు తీస్తానని కలలో కూడా అనుకోలేదని చెప్పాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో బాగా ఆడిన ఈ సీనియర్ స్పిన్నర్ టెస్టుల్లో కపిల్ సాధించిన 434 వికెట్ల మైలురాయిని దాటాడు. దాంతో ఇండియా తరఫున ఈ ఫార్మాట్ లో ఎక్కువ వికెట్లు సాధించిన రెండో బౌలర్ గా నిలిచాడు. ‘కపిల్ పాజీ రికార్డును అందుకోవడం గొప్పగా అనిపిస్తోంది. అప్పట్లో రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును కపిల్ దాటినపుడు మా నాన్నతో కలిసి చూసి ఎంతో ఆనందించాం. అలాంటిది నేను కపిల్ రికార్డును దాటుతానని కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఎనిమిదేళ్లప్పుడే నేను బ్యాటర్ అవ్వాలని భావించా. 1994లో సచిన్ టెండూల్కర్ అప్పుడప్పుడే ఫేమస్ అవుతుండగా.. కపిల్ బంతితో చెలరేగిపోతున్నాడు. అప్పుడు బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. కానీ, మా నాన్న సలహాతో నేను మరో కపిల్ కావాలని మీడియం పేస్ బౌలింగ్ వేసేవాడిని. అలాంటి వ్యక్తిని ఆఫ్ స్పిన్నర్ గా మారి ఇన్నేళ్లుగా టీమిండియాకు సేవలందిస్తున్నా. నేను ఇండియాకు ఆడతానని కూడా అస్సలు అనుకోలేదు. ఇప్పుడు కపిల్ రికార్డును దాటినందుకు సంతోషంగా భావిస్తున్నా’ అని అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ లో చెప్పుకొచ్చాడు.
స్పిన్ ఆయుధంగా మార్చిండు
ప్రపంచ క్రికెట్లో స్పిన్‌తో ఎంతో మ్యాజిక్ చేసిన ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ పై అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్లో స్పిన్ బౌలింగ్‌ను అతను ఓ ఆయుధంగా మార్చాడని కొనియాడాడు. వార్న్ చనిపోయాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని వెల్లడించాడు. ‘ప్రపంచ క్రికెట్లో స్పిన్ బౌలింగ్‌ను ముందుండి నడిపించిన పతాకధారిగా వార్న్‌ను చూశా. వరల్డ్ టాప్–3 వికెట్ టేకర్స్ అయిన మురళీధరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే స్పిన్నర్లే. అందరిలో వార్న్ ఆసక్తికరమైన వ్యక్తి. స్పిన్ బౌలింగ్‌కు కొత్త అర్థం చెబుతూ కెరీర్లో 1000కిపైగా వికెట్లు సాధించాడు. ఇంతటి అరుదైన రికార్డును సాధించడం అందరికీ సాధ్యం కాదు. అలాంటి వ్యక్తి మృతిని నమ్మలేకపోతున్నా. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. వార్న్.. మైక్ గాటింగ్ ను ఔట్ చేసిన ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ గురించి అందరూ మాట్లాడుకుంటారు. కానీ 2005 యాషెస్ సిరీస్ లో ఇంగ్లండ్ బ్యాటర్ ఆండ్రూ స్ట్రాస్ ను ఔట్ చేసేందుకు వార్న్ వేసిన బాల్ నా ఫేవరెట్. ఆ సిరీస్ లో వార్న్ ఆసీస్ విక్టరీ కోసం ఎంతో పోరాడాడు. అతడు ఓ మ్యాస్ట్రో, అసాధారణ వ్యక్తి’ అని అశ్విన్ అన్నాడు.
వార్న్ భుజాల బలం వల్లే..
వార్న్ కు చిన్నతనంలో జరిగిన ఓ యాక్సిడెంట్ గురించి అశ్విన్ వెల్లడించాడు. దాని తర్వాత అతడి భుజాల బలం పెరిగిందని.. అందుకే వార్న్ అత్యుత్తమ స్పిన్నర్ గా ఎదిగాడన్నాడు. ‘ఓ స్పిన్నర్ అత్యుత్తమ బౌలర్ గా రాణించాలంటే భుజాలు బలంగా ఉండాలని ద్రవిడ్ ఓసారి నాకు చెప్పాడు. భుజాలు బలంగా ఉండటం వార్న్ కు అడ్వాంటేజ్ అన్నాడు. చిన్నతనంలో ఫుట్‌బాల్ ఆడుతున్నపుడు వార్న్ కాళ్లు విరిగిపోయాయి. రెండు కాళ్లకు పట్టీలు కట్టారు. 3,4 వారాలు పూర్తిగా బెడ్ కే పరిమితమయ్యాడు. చేతుల సాయంతో ముందుకు వెళ్లేవాడు. అలా చేయడం వల్ల అతడి భుజాలు బలంగా అయ్యాయి. ఆ సమయంలోనే నడుం పైభాగాన్ని మరింత బలంగా మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఇక తిరిగి చూసుకోలేదు. ఇదే విషయాలను వార్న్.. ద్రవిడ్ భాయ్ కు చెప్పాడట. జీవితంలో ప్రతి ఒక్కరికీ అడ్డంకులు ఎదురవుతాయి. కానీ ఆ అడ్డంకిని వార్న్ సక్సెస్ ఫార్ములాగా ఎలా మార్చుకున్నాడో చూడండి’ అని అశ్విన్ వార్న్ పై ప్రశంసలు కురిపించాడు.