పూర్తి టైమ్ కోదాడ, హుజూర్‌నగర్‌కే కేటాయిస్త
హుజూర్‌నగర్‌లో సొంతిల్లు కట్టుకుంట
మున్సిపల్ ఎన్నికల అనంతరం పీసీసీ చీఫ్ పదవి నుంచి దిగిపోతానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో సొంతిల్లు కట్టుకొని, పూర్తి సమయాన్ని కోదాడ, హుజూర్‌నగర్‌కే కేటాయిస్తానని తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘మొన్న హుజూర్నగర్ బై ఎలక్షన్ రిజల్స్ట్కొంత మనకు సెట్‌బ్యాక్ అయినా ఆత్మస్థైరంతో ముందుకు వెళ్లాలి. ఇప్పుడు నేను పీసీసీ ప్రెసిడెంట్‌గా కొంత కాలం కొనసాగి.. మున్సిపల్ ఎన్నికలు అయిపోయినంక దిగిపోవడం జరుగుతుంది. హుజుర్నగర్లో కూడా అతి త్వరలో ఇల్లు మొదలుపెట్టపోతున్న. పూర్తిస్థాయిలో ఇక్కడే ఉండబోతున్న. మీరు గర్వపడే విధంగా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్త” అని కేడర్‌తో అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనవరి 5న రిజర్వేషన్ల ప్రకటన అనంతరం సాయంత్రం వరకు అభ్యర్థుల ఎంపిక జరిగేలా సమన్వయ కమిటీ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హుజూర్నగర్ ప్రస్తుత ఎమ్మెల్యే పదవిలోకి వచ్చి వంద రోజులు కూడా కాకుండానే అవినీతి మొదలుపెట్టారని ఉత్తమ్ ఆరోపించారు. గ్రామ పంచాయతీల ట్రాక్టర్లు, ఎల్‌ఈడీ బల్బులు, మినరల్ ఫండ్స్, వెంచర్ల పేరిట అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. మఠంపల్లి మండలంలోని అమరేశ్వరీ ఫ్యాక్టరీ వద్ద 40 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకురాలు పద్మావతిరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసి, పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని కేడర్‌కు సూచించారు.
