ఫండ్స్ ఇస్తేనే ప్రాజెక్టు ల పరుగు!.. ఇప్పటికే ఆర్థిక శాఖకు ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలు

ఫండ్స్ ఇస్తేనే ప్రాజెక్టు ల పరుగు!.. ఇప్పటికే ఆర్థిక శాఖకు ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలు
  •     ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్లు అవసరమనే అంచనాలు
  •     పాలమూరు – రంగారెడ్డి ప్రస్తుత పనులకే రూ.2,500 కోట్లు కావాలి
  •     ఎస్​ఎల్​బీసీకి రూ.వెయ్యి కోట్లు అవసరమంటున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సాగునీటి ప్రాజెక్టులను నిధుల కొరత వేధిస్తోంది. 2026 నాటికి 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా 12 ప్రాజెక్టులను ప్రాధాన్య జాబితాలో చేర్చుకున్న ఇరిగేషన్​ శాఖ.. ఫండ్స్​ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వాటికి దాదాపు రూ.7 వేల కోట్ల దాకా అవసరం ఉన్నదని అంచనా వేసిన అధికారులు.. అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 

స్వయంగా మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి కూడా నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ప్రాధాన్య జాబితాలో పెట్టుకున్న ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోతుండడంతో.. పనులు పెండింగ్​లో పడిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. 

పాలమూరు జిల్లాకే ఎక్కువ కావాలి..

ఇరిగేషన్​ శాఖ ప్రాధాన్యంగా పెట్టుకున్న జాబితాలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులే ముందు వరుసలో ఉన్నాయి. ఆ జిల్లాలోని ప్రస్తుతం జరుగుతున్న పనులకు కనీసం రూ.4వేల కోట్ల దాకా అవసరమవుతాయనే అంచనాలున్నాయి. అందులోనూ  పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్​ ఇరిగేషన్​ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ప్యాకేజీ 3 కింద జరుగుతున్న పనులకు రూ.2500 కోట్లు అవసరమవుతాయని చెప్తున్నారు. ఇటు అదే జిల్లాలోని నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్​సాగర్​ వంటి ప్రాజెక్టులకు మరో రూ.వెయ్యి కోట్లు అవసరమవుతాయని అంటున్నారు. 

దీనికితోడు తాజాగా కొడంగల్– నారాయణపేట లిఫ్ట్​కూ నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కూడా వచ్చేశాయి. ఈ క్రమంలోనే పాలమూరు ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తే.. కరువు జిల్లాలోని వేలాది ఎకరాల ఆయకట్టుకు వీలైనంత త్వరగా నీళ్లు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

ఎస్​ఎల్​బీసీకీ వెయ్యి కోట్లు కావాలి..

ఎస్​ఎల్​బీసీ ప్రాజెక్టుకు వరుస అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో ఇటీవలే బ్లాస్టింగ్​పనులు మొదలయ్యాయి. మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి చొరవతో రాత్రింబవళ్లూ పనులు చేయించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఇంకో రూ.వెయ్యి కోట్లు కావాలని అధికారులు అంచనా వేశారు. 

ఇటు సీతారామ, సీతమ్మసాగర్​ ఇంటిగ్రేటెడ్​ ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్లు, దేవాదులకు రూ.450 కోట్ల మేర అవసరమవుతాయని భావిస్తున్నారు. చిన్న కాళేశ్వరం, చనాకా కొరాట, మోడికుంటవాగు వంటి ఇతర ప్రాజెక్టులూ ఉన్నాయి. వాటికి కూడా పెద్దమొత్తంలో నిధులు అవసరమవుతాయి. వీటిలో పెండింగ్​ బిల్లులూ చాలా వరకూ ఉన్నాయని చెప్తున్నారు.

ఈ బడ్జెట్​లో కేటాయింపులెన్నో..

నిరుడు బడ్జెట్​లో ఇరిగేషన్​ శాఖకు రూ.22 వేల కోట్ల కేటాయింపులు చేసినా.. చివరకు విడుదల చేసింది మాత్రం రూ.10 వేల కోట్లు కూడా లేవని అధికారులు చెప్తున్నారు. ఏటా ప్రాజెక్టుల పనులు, పెండింగ్​ బిల్లులు, అప్పుల కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల దాకా కూడా ప్రభుత్వానికి డిపార్ట్​మెంట్​ నుంచి ప్రతిపాదనలు వెళ్తున్నాయి. ఈ ఏడాది కూడా సీఈలు రూ.80 వేల కోట్లకుపైగా కేటాయింపులు కావాలని ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. అందులో అప్పులకే రూ.11 వేల కోట్లుగా పెట్టినట్టు చెబుతున్నారు. 

ఇక, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.30 వేల కోట్లు అడిగినట్టు సమాచారం. అప్పులు పోనూ దాదాపు 20 వేల కోట్ల దాకా పనులకే అవసరమవుతాయని అంచనా వేశారు. ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.18 వేల కోట్లు, సీత్మసాగర్​ ప్రాజెక్టులుక రూ.2500 కోట్లు, తుమ్మిహిఎట్లికి రూ.2300 కోట్ల మేర ప్రతిపాదనలు వచ్చాయని తెలిసింది. అయితే, వీటిలో చాలా వరకు కోతలు పడే అవకాశాలున్నాయి. బడ్జెట్​ను ఫైనల్​ చేసేందుకు ఈ నెల 19న మంత్రి ఉత్తమ్​ సమావేశం నిర్వహించనున్నారు.