- అందులో 46 లక్షల మంది మృతులు..
- ‘సర్’ ముసాయిదా జాబితా రిలీజ్
- తొలగించిన ఓట్లలో 46 లక్షల మంది మృతులు
- 2.57 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు వలస..
- ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లున్నవారు 25.47 లక్షల మంది
- సర్‌కు ముందు ఓటర్లు 15.44 కోట్ల మంది.. తర్వాత 12.56 కోట్లు
- మార్చి 6న తుది జాబితా విడుదల చేయనున్న ఈసీ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓటరు జాబితా నుంచి 2.89 కోట్ల మంది (18.70 శాతం) ఓటర్లను తొలగించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నిర్వహించిన ఎన్నికల సంఘం మంగళవారం ఓటరు ముసాయిదా జాబితాను రిలీజ్ చేసింది. తొలగించిన 2.89 కోట్ల మందిలో 46.23 లక్షల మంది (15.9శాతం) ప్రాణాలతో లేరని పేర్కొన్నది.
2.57 కోట్ల మంది (14.06 శాతం) ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని, 25.47 లక్షల మంది (1.65 శాతం) ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారని వివరించింది. ‘సర్’కు ముందు యూపీలో 15.44 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ తొలగింపు తర్వాత మొత్తం ఓటర్ల సంఖ్య 12.55 కోట్లకు తగ్గింది. ఈసీఐఎన్‌ఈటీ యాప్, ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా ఈ ముసాయిదా జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
ఒకవేళ ఎవరి పేరైనా మిస్ అయినా, వివరాలు తప్పుగా ఉన్నా.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా అభ్యంతరాలు సమర్పించే చాన్స్ ఉన్నదని పేర్కొన్నారు. ఆ అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత ‘సర్’ తుది జాబితాను మార్చి 6న విడుదల చేయనున్నట్టు ఈసీ వెల్లడించింది.
3 సార్లు ఎన్యుమరేషన్ ప్రక్రియ పొడిగింపు
అత్యధిక జనాభా కలిగిన యూపీలో పెద్ద ఎత్తున తొలగింపులు జరుగుతాయనే ఆందోళనల మధ్య ఎన్యుమరేషన్ ప్రక్రియను మూడుసార్లు పొడిగించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్వోలు) ఇంటింటికీ తిరిగి సంతకం చేసిన ఫారమ్‌లను సేకరించారు.
మొత్తం ఓటర్లలో 81.03% (12.55 కోట్లు) మంది ఫారమ్‌లు సమర్పించగా, మిగిలిన 18.7% మంది సమాచారం అందకపోవడంతో వారి పేర్లను తొలగించినట్టు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. రాజధాని లక్నోలో అత్యధికంగా 30 శాతం మంది ఓటర్లు తగ్గారు.
గతంలో 39.9 లక్షలుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు 27.9 లక్షలకు చేరుకుంది. ఆ తర్వాత లలిత్‌పూర్‌లో ఓటర్ల సంఖ్య 9.5 లక్షల నుంచి 8.6 లక్షలకు(10% తగ్గుదల) పడిపోయింది. కాగా, ఇంత భారీ స్థాయిలో ఓట్లు తొలగించడం రాజకీయంగా దుమారం రేపుతున్నది.
అమర్త్యసేన్‌కు ‘సర్’ నోటీస్: అభిషేక్ బెనర్జీ
బెంగాల్లో ఓటర్ల సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్‌కు సైతం ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చిందని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ చెప్పారు. మంగళవారం అమర్త్యసేన్ సొంత జిల్లా బీర్భూమ్లో జరిగిన ర్యాలీ లో అభిషేక్ మాట్లాడారు.
అమర్త్యసేన్‌ను కూడా ఈసీ హియరింగ్ కు పిలిచిందన్నారు. ఈ కామెంట్లపై ఎన్నికల సంఘం స్పందించిం ది. ఫారమ్‌లో స్పెల్లింగ్ మిస్టేక్ మాత్రమే జరిగిందని, అమర్త్యసేన్ హియరింగ్‌కు రావాల్సిన అవసరంలేదని వివరణ ఇచ్చింది.
