ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో అరుదైన ఘట్టం

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో అరుదైన ఘట్టం

లఖ్‌నవూ : ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ న్యాయస్థానంగా మారింది. 19 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఆరుగురు పోలీసులకు ఒక రోజు జైలు శిక్ష విధించింది. 2004లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సలీల్‌ విష్ణోయ్‌, ఆయన మద్దతుదారులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. దీనిపై ఆయన అప్పట్లోనే సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన కమిటీ.. ఆరుగురికి శిక్ష విధించాలని సిఫార్సు చేసింది.

ఈ మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను మార్చి 3వ తేదీన (శుక్రవారం) అసెంబ్లీకి  పిలిపించింది. వారికి జైలు శిక్ష విధించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి సురేష్‌ కుమార్‌ ఖన్నా ప్రతిపాదించారు. దీనిపై నిర్ణయాధికారం స్పీకర్‌దేనని కాంగ్రెస్‌, బీఎస్పీ సహా వివిధ పార్టీల నేతలు స్పష్టం చేశారు. దీంతో స్పీకర్‌ సతీశ్‌ మహానా తీర్పు వెలువరించారు. ఆరుగురు పోలీసులు ‘లక్ష్మణ రేఖ’ను అతిక్రమించారని పేర్కొన్నారు. 

శాసన సభ ప్రాంగణంలోని ఒక గదిని కారాగారంగా పరిగణించి, అందులో వారిని నిర్బంధించాలని స్పీకర్ ఆదేశించారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకూ వారిని అక్కడే ఉంచాలన్నారు. ఆ పోలీసులను బాగా చూసుకోవాలని, ఆహారం, ఇతర వసతులు కల్పించాలని సూచించారు. 

లాఠీఛార్జి జరిగినప్పుడు అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, దాని మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌దళ్‌ సభ్యులు.. తాజా తీర్పు వెలువడే సమయంలో సభలో లేరు. సలీల్‌ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.