మన ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే టాప్

మన ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే టాప్
  • ఈ లోక్ సభ ఎన్నికల్లో ఖర్చు అంచనా రూ. 1.35 లక్షల కోట్లు
  • ఈసీ, ప్రభుత్వం, పార్టీలు, అభ్యర్థులకు కలిపి లెక్కకట్టిన నిపుణులు
  • 2019లో రూ. 60 వేల కోట్లే.. ఇప్పుడు అంతకు రెట్టింపు కానున్న ఖర్చు
  • దేశంలో 96 కోట్ల ఓటర్లు.. ఒక్కో ఓటరుపై రూ. 1,400 ఖర్చు పెడుతున్నరు  
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల కన్నా ఇదే ఖరీదైన ఎలక్షన్ 
  • 2020 యూఎస్ ఎలక్షన్​లో 1.2 లక్షల కోట్ల వ్యయం 

న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్​సభ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలుస్తాయని ఎక్స్​పర్టులు అంచనా వేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, పార్టీలు, అభ్యర్థులు కలిపి.. దాదాపు రూ. 1.35 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్తున్నారు. పోయినసారి 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రూ. 60 వేల కోట్లు ఖర్చయినట్లు అంచనా వేయగా.. ఈసారి అంతకు రెట్టింపుగా రూ.1.35 లక్షల కోట్లు వ్యయం కావచ్చని పేర్కొంటున్నారు. గత 35 ఏండ్లుగా ఎన్నికల ఖర్చును ట్రాక్ చేస్తున్న సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) సంస్థ చైర్మన్ ఎన్.భాస్కరరావు ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు.

ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పెట్టే ఖర్చులన్నింటిని కలిపి ఈ అంచనాలు వేసినట్లు ఆయన తెలిపారు. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో బీజేపీనే అత్యధికంగా పబ్లిసిటీ కోసం ఖర్చు చేస్తోందన్నారు. ఈసారి ఎన్నికల ఖర్చును తొలుత రూ.1.2 లక్షల కోట్లుగా అంచనా వేశామని.. కానీ ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడైన తర్వాత పరిశీలించిన పరిస్థితులను బట్టి.. అంచనాలను రూ.1.35 లక్షల కోట్లకు పెంచామన్నారు. అయితే, ఎన్నికల ప్రక్రియలోకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మాత్రమే కాకుండా అనేక మార్గాల్లో డబ్బు ప్రవహిస్తోందన్నారు. 2004 నుంచి 2023 వరకు దేశంలోని ఆరు ప్రధాన పార్టీలకు రూ.19,083 కోట్ల రహస్య విరాళాలు వచ్చినట్లు ఇటీవల అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కూడా వెల్లడించిందన్నారు.  

ఈసీ ఖర్చు 10 నుంచి 15 శాతమే.. 

ఎన్నికల ప్రచారంలో ర్యాలీలు, రవాణా, జన సమీకరణ, ఇన్ ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు, లీడర్లకు ముడుపులు, టీవీలు, పేపర్లలో ప్రకటనలు, గోడలపై రాతలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, డిజిటల్ ప్రచారం వంటి వాటికి పార్టీలు, అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు భాస్కర రావు తెలిపారు. మొత్తం ఎన్నికల ఖర్చులో ఎన్నికల సంఘం పెడుతున్న ఖర్చు 10 నుంచి 15 శాతం మాత్రమే ఉంటుందన్నారు. దేశంలో మొత్తం 96.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. మొత్తం ఖర్చును లెక్కిస్తే.. ఒక్కో ఓటరుపై రూ.1,400 ఎక్స్ పెండిచర్ పెడుతున్నట్టుగా చెప్పారు.

మొత్తం ఎన్నికల ఖర్చులో 30 శాతం మీడియా క్యాంపెయిన్ కే అవుతున్నట్టు అంచనా వేశామన్నారు. అయితే, 45 రోజుల పాటు సుదీర్ఘంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియలో కంటికి కనిపించకుండా తెరవెనుక జరుగుతున్న ఖర్చును లెక్కిస్తే అంచనాలు ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతాయన్నారు. 2019 ఎన్నికల ఖర్చులో 45 శాతం బీజేపీ ఒక్కటే ఖర్చు చేసిందని.. ఈసారి అది ఇంకా పెరుగుతుందన్నారు. 

అమెరికా కంటే కాస్ట్​లీ.. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల కన్నా మన లోక్ సభ ఎన్నికలే ఖరీదైనవిగా మారాయని భాస్కరరావు చెప్పారు. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 14.4 బిలియన్ డాలర్లు (రూ. 1.2 లక్షల కోట్లు) ఖర్చు అయినట్టుగా ఓపెన్ సీక్రెట్స్ డాట్ ఆర్గ్ సంస్థ అంచనా వేసిందన్నారు. ఇప్పుడు 2024 లోక్ సభ ఎన్నికల ఖర్చు ఆ రికార్డ్ ను అధిగమించి, రూ. 1.35 లక్షల కోట్లకు చేరే అవకాశాలు ఉన్నందున ఇవి ప్రపంచంలోనే అతి ఖరీదైన ఎన్నికలుగా నిలుస్తాయన్నారు.

భారత రాజకీయాల్లో ఐడియాలజీ కంటే మనీ పవర్ కే ప్రాధాన్యం పెరుగుతోందని తాజాగా తాను రాసిన ‘నెక్స్ట్ బిగ్ గేమ్ చేంజర్ ఆఫ్​ఎలక్షన్స్’ పుస్తకంలోనూ భాస్కరరావు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు కూడా కార్పొరేట్ సంస్థలుగా మారిపోయాయని, ఎన్నికల్లో ప్రముఖ సంస్థలు, వ్యక్తులతో బ్రాండింగ్ చేయించుకుంటున్నాయని తెలిపారు. ఫేస్ బుక్, గూగుల్ వంటి కంపెనీలు కూడా పొలిటికల్ క్యాంపెయిన్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.