బురఖాతో వస్తే నగలు అమ్మం..యూపీ జువెలరీ వ్యాపారుల తీర్మానం

బురఖాతో వస్తే నగలు అమ్మం..యూపీ జువెలరీ వ్యాపారుల తీర్మానం

మాస్క్, హెల్మెట్ ధరించినా షాపులోకి నో ఎంట్రీ

వారణాసి: బురఖా ధరించి వచ్చే మహిళలకు, మాస్కులు, హెల్మెట్లు ధరించిన వారికి నగలు అమ్మబోమని ఉత్తర ప్రదేశ్ ​గోల్డ్ షాపు యజమానుల సంఘం తీర్మానించింది. దీంతో ఉత్తర ప్రదేశ్​లోని జువెలరీ షాపుల ముందు నో ఎంట్రీ, ఎంట్రీ ప్రొహిబిటెడ్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. ముఖం కనిపించకుండా బురఖా కానీ, మాస్క్ కానీ, హెల్మెట్ కానీ ధరించిన వారికి తమ షాపులోకి అనుమతి లేదని, లోపలికి ఎంటరయ్యే ముందు ముసుగు తొలగిస్తే అనుమతిస్తామని వర్తకులు ఈ పోస్టర్లు అతికించారు. 

ఇటీవలి కాలంలో గోల్డ్ షాపుల్లో దొంగతనాలు పెరిగిపోతుండడంతో స్వీయరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం తప్ప ఏ మతాన్నీ కించపరిచే ఉద్దేశం తమకు లేదని ఉత్తరప్రదేశ్ ​జువెలర్స్ అసోసియేషన్ (యూపీజేఏ) పేర్కొంది. ఈమేరకు ఈ నిబంధనను వారణాసిలో ఇప్పటికే అమలులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. దొంగతనాలు, దోపిడీ ఘటనలు చోటుచేసుకున్నపుడు ముఖాన్ని కవర్ చేసుకున్న వారి గుర్తింపు కష్టమవుతోందని వారు పేర్కొన్నారు. 

ఈ క్రమంలోనే షాపుల యజమానులు, సిబ్బంది రక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిబంధనపై ముస్లిం వ్యాపారులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బురఖా ధరించడం తమ సంప్రదాయమని, దానిని తొలగించమనడం అవమానించడమేనని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ముసుగు ధరించిన వారిని షాపులలోకి అనుమతించబోమని చెప్పడం చట్టవ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు.