పూర్తయిన 31మీ. వర్టికల్ డ్రిల్లింగ్.. రెస్క్యూ ఆపరేషన్‌పై భారత సైన్యం ఫోకస్

పూర్తయిన 31మీ. వర్టికల్ డ్రిల్లింగ్.. రెస్క్యూ ఆపరేషన్‌పై భారత సైన్యం ఫోకస్

రెస్క్యూ ఆపరేషన్ నేటితో 16వ రోజుకు చేరుకుంది. నవంబర్ 12న నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో కార్మికులు లోపల చిక్కుకుపోయారు. అప్పట్నుంచి వారిని రక్షించే ప్రయత్నం చేస్తోన్న అధికారులు.. నవంబర్ 26న సాయంత్రం కొత్త విధానాన్ని అనుసరించారు. ఆదివారం సిల్క్యారా-బార్కోట్ సొరంగం పైన ఉన్న కొండలోకి డ్రిల్లింగ్ ప్రారంభించారు. మొదట్నుంచి చేస్తోన్న ప్రయత్నాల్లో ఇటీవల కొన్ని పరాజయాలను చవి చూసిన రెస్క్యూ సిబ్బంది.. సమాంతరంగా మాన్యువల్ డ్రిల్లింగ్‌తో పాటు ఇప్పుడు వర్టికల్ డ్రిల్లింగ్ చేయడంపై దృష్టి సారించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి గ్యాస్ కట్టర్‌తో పాటు ప్లాస్మా కట్టర్‌ను తెప్పించారు.

టన్నెల్‌లో కార్మికులు 60 మీటర్ల దూరంలో చిక్కుకుపోగా.. అగర్ యంత్రం సాయంతో 47 మీటర్లు డ్రిల్లింగ్ చేసి పైపులు వేశారు. మిగిలిన 12 మీటర్లను ఆర్మీ ఇంజీనిరింగ్ బృందం తవ్వి పైపులు వేయాల్సి ఉంది. ప్రస్తుతం అన్ని శిథిలాలు (అగర్ మెషిన్) తొలగించబడ్డాయని, బహుశా 3 గంటల తర్వాత మళ్లీ ప్రారంభమవుతుందని మైక్రో టన్నెలింగ్ నిపుణుడు క్రిస్ కూపర్ చెప్పారు. ఇప్పటివరకు 31 మీటర్ల వరకు వర్టికల్ డ్రిల్లింగ్ జరిగిందని వెల్లడించారు.