
వందల కిలోమీటర్ల నుంచి రూరల్ క్రికెటర్లు వస్తున్నారు: వివేక్ వెంకట స్వామి
వరంగల్/ నిజామాబాద్, వెలుగు: ఇక నుంచి ప్రతీ ఏటా వెలుగు – వీ 6 ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వీఐఎల్ మీడియా చైర్మన్ వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. వెలుగు – వీ6 మీడియా గ్రూపు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను వరంగల్‍లో చందా కాంతయ్య మెమోరియల్ కాలేజీ మైదానంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తమ కుటుంబానికి క్రికెట్ ఆటపై మక్కువ ఎక్కువ అన్నారు. ‘ఉప్పల్‍లో క్రికెట్ స్టేడియం నిర్మాణంలో ఉన్నప్పుడు దానికి స్పాన్సర్ చేయాల్సిందిగా మా నాన్న వెంకటస్వామి నాపై ఒత్తిడి తెచ్చారు. అప్పుడు మా విశాక గ్రూపు ఇంత పెద్దగా లేదు. కేవలం మా నాన్న చేసిన ఒత్తిడితో స్పాన్సర్ చేశాను. అందువల్లే మా నాన్న పేరు మీద గతేడాది వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాం. ఈ టోర్నీ సందర్భంగా హైదరాబాద్ లో పోటీలు ఎందుకు.. గ్రామీణ ప్రాంతాల్లో ఎందరో క్రికెట్ క్రీడాకారులు ఉన్నారు. వారి కోసం రూరల్ ఏరియాలో టోర్నీ పెట్టవచ్చు కదా అని చాలా మంది నన్ను అడిగారు. ఇటీవల ఓ గ్రామీణ క్రీడాకారుడు మహారాష్ట్ర నుంచి 600 కిలోమీటర్ల దూరం నుంచి మహబూబ్ నగర్‍లో జరిగిన వెలుగు – వీ 6 సెలెక్షన్స్‌కు వచ్చాడని తెలిసింది. అది విన్నప్పుడు గ్రామీణ క్రికెట్‍కు నేను చేయాల్సింది ఎంతో ఉందని అర్థమైంది. ఇకపై ఏటా వెలుగు – వీ6 టోర్నమెంట్ నిర్వహించి, పల్లె క్రికెటర్లను ప్రోత్సాహిస్తాం’ అని వివేక్ ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్‍అథారిటీ చైర్మన్ మర్రియాదవరెడ్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ కమిషనర్ రవికిరణ్ లకు వివేక్ ప్రత్యే కంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ క్రికెట్ మన క్రీడ కాదనే భావన ఉందని, ఇలాంటి టోర్నీల వల్ల ఆ అభిప్రాయం పోతుందన్నారు. ఇటీవల మహిళలు క్రికెట్ ఎక్కువగా ఆడుతున్నారని, వారి కోసం కూడా క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించాలని కోరారు. గ్రామీణ క్రీడాకారుల కోసం జిల్లా స్థాయిలో నిర్వహించడం అభినందనీయమని యాదవరెడ్డి అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ మాట్లాడుతూ
గతంలో నిర్వహించిన వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్ పెద్ద సక్సెస్ అయ్యిందని, ఇతర రాష్ట్రాలు ఆ టోర్నీని ఆదర్శంగా తీసుకున్నాయని తెలిపారు. ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న వెలుగు – వీ6 యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం తొలి రోజు పోటీలో పాల్గొన్న నర్సంపేట, వర్ధన్నపేట జట్లకు చెందిన క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. వివేక్ బౌలింగ్ చేయగా సుదర్శన్ రెడ్డి కొద్ది సేపు బ్యాటింగ్ చేశారు. మధ్యాహ్నం నర్సంపేట, వర్థన్నపేట మధ్య మ్యాచ్ కు మాజీ మంత్రి జి.వినోద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
గ్రామాల్లో ప్రతిభకు కొదవలేదు: వరుణ్
గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ పట్ల పిచ్చిప్రేమతో ఆడే వారు ఎందరో ఉన్నారని వెలుగు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ వరుణ్ అన్నారు. ఆర్మూర్ లోని జావీద్ భాయ్ మినీ స్టేడియంలో ప్రారంభమైన వెలుగు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‍లకు వెలుగు, వీ–6 సంస్థల డైరెక్టర్ వైష్ణవి, డాక్టర్ నవీన్‍తో కలిసి ఆయన హాజరయ్యారు. ఆర్మూర్ లోని క్రికెట్ ప్రాంగణంలో జరిగే మ్యాచ్‍లకు హాజరైనక్రీడాకారులకు ట్రాక్ సూట్లను అందించారు. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీసి వారిని ప్రోత్సహిద్దామనే లక్ష్యంతో మొట్టమొదటిసారిగా వెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో వెలుగు క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామన్నారు. అన్ని జిల్లాల నుంచి ఊహించనంత రెస్పాన్స్ వస్తోందని అన్నారు. జిల్లాల్లో ఆడిన క్రీడా జట్లనుంచి రాష్ట్రజట్టుకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని టోర్నమెంట్‍లో ప్రతిభను నిరూపించుకోవాలని క్రీడాకారులకు సూచించారు.

