ఏటీపీ ఛాలెంజర్ సింగిల్స్ రన్నరప్‌గా మానస్ ధమ్నే

ఏటీపీ ఛాలెంజర్ సింగిల్స్ రన్నరప్‌గా మానస్ ధమ్నే

న్యూఢిల్లీ: భారత యువ టెన్నిస్ సంచలనం మానస్ ధమ్నే తన తొలి ఏటీపీ ఛాలెంజర్ సింగిల్స్ టైటిల్ వేటలో వెనుకంజ వేశాడు. కజకిస్తాన్‌లోని షిమ్కెంట్‌లో ఆదివారం జరిగిన హోరాహోరీ పోరులో బెల్జియానికి చెందిన బువైసర్ గడమౌరి చేతిలో మానస్ ఓటమి పాలయ్యాడు. రెండు గంటల పాటు సాగిన ఈ తుది పోరులో 18 ఏళ్ల మానస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 6-7,(8), 4-6 స్కోరుతో పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. 

తొలి సెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన మానస్.. అనుభవజ్ఞుడైన ప్రత్యర్థిని టైబ్రేకర్ వరకు లాగాడు. ఒక దశలో సెట్ పాయింట్లు సాధించినా, గడమౌరి చివరికి 10-8తో ఆ సెట్‌ను చేజిక్కించుకున్నాడు. ఈ ఓటమి ప్రభావం రెండో సెట్‌పై పడడంతో బెల్జియం ఆటగాడు కీలక బ్రేక్ సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఓటమి ఎదురైనా మానస్‌కు ఇది చిరస్మరణీయ వారమనే చెప్పాలి. సోమవారం విడుదల కానున్న నూతన ర్యాంకింగ్స్‌లో ఈ యువ ఆటగాడు తొలిసారిగా టాప్-400లోకి ప్రవేశించనున్నాడు.