సన్ రైజర్స్‎కు కేకేఆర్ షాక్.. వరుస విజయాలకు చెక్పెట్టిన నైట్ రైడర్స్

సన్ రైజర్స్‎కు కేకేఆర్ షాక్.. వరుస విజయాలకు చెక్పెట్టిన నైట్ రైడర్స్
  • 165 పరుగులకే కుప్పకూలిన హైదరాబాద్
  • స్పిన్నర్ల ధాటికి విలవిలలాడిన ఎస్ఆర్​హెచ్​ ప్లేయర్లు
  • 'ప్లేయర్ ఆఫ్​ద మ్యాచ్' గా​ వరుణ్​చక్రవర్తి
  • హాఫ్​ సెంచరీతో రాణించిన రఘువంశీ

హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్​రైజర్స్‎కు కోల్​కతా నైట్​రైడర్స్​చెక్​పెట్టింది. ఐపీఎల్​19లో భాగంగా ఆదివారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‎లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్​గెలిచి బ్యాటింగ్​చేపట్టిన సన్​రైజర్స్ ఆరంభంలో ధాటిగానే ఆడింది. ఓపెనర్​ ట్రావిస్​హెడ్​(28 బంతుల్లో 61; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్​కిషన్ (29 బంతుల్లో 42: 4ఫోర్లు, 2 సిక్స్​లు) చెలరేగి ఆడారు. కానీ మిగతా వారు ఎవ్వరూ రాణించకపోవడంతో 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్​అయింది. 

కోల్​కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, నరైన్ 31 పరుగులకు 2 వికెట్లు తీశాడు. కార్తీక్ త్యాగికి 2 వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్​చేపట్టిన కోల్​కతా (18.2) ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రఘు వంశీ ​(47 బంతుల్లో  5 ఫోర్లు, 2 సిక్స్​లతో 59), కెప్టెన్​ అజింక్యా రహానే (​36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్​తో43) పరుగులు చేశారు. తన స్పిన్​మాయాజాలంతో మూడు వికెట్లు పడగొట్టిన వరుణ్​చక్రవర్తికి 'ప్లేయర్ ఆఫ్​ద మ్యాచ్'​దక్కింది.

ఆరంభంలో ఊపు.. ఆపై విఫలం

మొదట బ్యాటింగ్ చేపట్టిన సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‎కు ఓపెనర్ ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో 61 పరుగులతో శుభారంభాన్నిచ్చాడు. అభిషేక్ శర్మ (15)తో కలిసి హెడ్ తొలి వికెట్‌‌‌‌కు 3.4 ఓవర్లలోనే 44 పరుగులు జోడించాడు. వరుసగా రెండో హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించడంతో పవర్‌‌‌‌ప్లే ముగిసేసరికి హైదరాబాద్ వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. 10 ఓవర్లకు స్కోరు 107/2కి చేరింది. తర్వాత ఇన్నింగ్స్ ఒక్కసారిగా తలకిందులైంది.

కేవలం 10 ఓవర్ల వ్యవధిలో 60 పరుగులు మాత్రమే జోడించి 9 వికెట్లు కోల్పోయింది. ఐపీఎల్ 2026 సీజన్‌‌‌‌లో ఎస్ఆర్‌‌‌‌హెచ్ ఆలౌట్ అవ్వడం ఇదే తొలిసారి. వరుణ్ చక్రవర్తి 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, నరైన్ 31 పరుగులకు 2 వికెట్లు తీశాడు. కార్తీక్​కు రెండు వికెట్లు దక్కాయి. హెడ్ ఇన్నింగ్స్‌‌‌‌లో ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 42) అండగా నిలిచాడు. రెండో వికెట్‌‌‌‌కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

పతనం మొదలైంది ఇలా..

తొమ్మిదో ఓవర్ ఆఖరి బంతికి చక్రవర్తి బౌలింగ్‌‌‌‌లో హెడ్ అవుట్ అవ్వడంతో ఎస్ఆర్‌‌‌‌హెచ్ పతనం మొదలైంది. ప్రమాదకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (11) గ్రీన్ బౌలింగ్‌‌‌‌లో రోవ్‌‌‌‌మన్ పావెల్ పట్టిన అద్భుత క్యాచ్‌‌‌‌కు పెవిలియన్ చేరాడు. డీప్ మిడ్ వికెట్‌‌‌‌లో గాలిలోకి ఎగిరి ఒంటి చేత్తో పావెల్ ఈ క్యాచ్‌‌‌‌ను అందుకున్నాడు. వరుస ఓవర్లలో రవిచంద్రన్ స్మరణ్, అనికేత్ వర్మను చక్రవర్తి అవుట్ చేశాడు.

16వ ఓవర్లో క్రీజులో పాతుకుపోయిన కిషన్‌‌‌‌ను అవుట్ చేయడం ద్వారా నరైన్ తన 200వ ఐపీఎల్ వికెట్‌‌‌‌ను ఖాతాలో వేసుకున్నాడు. తన 197వ మ్యాచ్ ఆడుతున్న నరైన్ లీగ్ చరిత్రలో 200 వికెట్లు తీసిన మూడో బౌలర్‌‌‌‌గా నిలిచాడు. ఇతడి కంటే ముందు యుజ్వేంద్ర చాహల్ (228), భువనేశ్వర్ కుమార్ (215) మాత్రమే ఈ ఘనత సాధించారు.

రాణించిన రహానే, రఘువంశీ

165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్​ప్రారంభంలో ఇంపాక్ట్ ప్లేయర్ ఫిన్ అలెన్ (13 బంతుల్లో 39) వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అజింక్య రహానే (36 బంతుల్లో 43), అంగ్‌‌‌‌క్రిశ్ రఘువంశీ (47 బంతుల్లో 59) బాధ్యతాయుతంగా ఆడి రెండో వికెట్‌‌‌‌కు 84 పరుగులు జోడించారు. రహానే 4 ఫోర్లు, ఒక సిక్సర్ బాదగా.. రఘువంశీ 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అలరించాడు. చివర్లో రింకూ సింగ్ (11 బంతుల్లో 22 నాటౌట్) ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. సన్​రైజర్స్​బౌలర్లలో ప్యాట్​కమిన్స్, శివాంగ్​కుమార్, సకీబ్​హుస్సేన్ ఒక్కో వికెట్​తీశారు. 

సంక్షిప్త స్కోర్లు:

సన్‌‌‌‌రైజర్స్ హైదరాబాద్: 19 ఓవర్లలో 165 ఆలౌట్ (ట్రావిస్ హెడ్ 61, ఇషాన్ కిషన్ 42; వరుణ్ చక్రవర్తి 3/36, సునీల్ నరైన్ 2/31).
కోల్‌‌‌‌కతా నైట్ రైడర్స్: 18.2 ఓవర్లలో 169/3 (అంగ్‌‌‌‌క్రిష్ రఘువంశీ 59, అజింక్య రహానే 43).

నరైన్ అరుదైన రికార్డు

నాలుగో ఓవర్​లో రెండు వికెట్లు పడగొట్టిన సునీల్ నరైన్.. ఐపీఎల్‌‌‌‌లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. లీగ్ చరిత్రలో యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌‌‌‌గా రికార్డు పుటల్లోకెక్కాడు.