న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎన్.మిట్టల్, ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్ సహా అదర్ పూనావాలా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేశారు. మిట్టల్ కుటుంబం 1.65 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 15,600 కోట్లు) ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కొనుగోలు విలువలో రాజస్థాన్ రాయల్స్ పురుషుల టీమ్, పార్ల్ రాయల్స్ (దక్షిణాఫ్రికా), బార్బడోస్ రాయల్స్ (కరీబియన్) జట్లు కూడా ఉన్నాయి.
బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, సీసీఐ వంటి సంస్థల ఆమోదానికి లోబడి ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
గతంలో కల్ సోమనీ నేతృత్వంలోని అమెరికా కన్సార్టియం 1.63 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినప్పటికీ పలు సాంకేతిక కారణాల వల్ల ఆ ఒప్పందం కార్యరూపం దాల్చలేదు. మిట్టల్ కుటుంబం ప్రకారం, రాజస్థాన్ రాయల్స్‌లో మిట్టల్ ఫ్యామిలీకి 75 శాతం, అదర్ పూనావాలాకు 18 శాతం వాటా ఉంటుంది.
మిగిలిన 7 శాతం వాటా మనోజ్ బదాలే సహా ప్రస్తుత ఇన్వెస్టర్ల వద్ద ఉంటుంది. పునర్వ్యవస్థీకరించిన బోర్డులో లక్ష్మీ మిట్టల్, ఆదిత్య మిట్టల్, వనీషా మిట్టల్-భాటియా, అదర్ పూనావాలా, మనోజ్ బదాలే సభ్యులుగా ఉంటారు. ఫ్రాంచైజీకి సంబంధించిన అనుభవజ్ఞుడిగా బదాలే తన సేవలను కొనసాగిస్తారు. గతంలో ఆర్సీబీ కోసం బిడ్ వేసిన అదర్ పూనావాలా, ఇప్పుడు ఆదిత్య మిట్టల్‌తో కలిసి ఈ పెట్టుబడి పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
