సింగరేణి యాజమాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోబాయి బాట’ కార్యక్రమంలో భాగంగా అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టును సందర్శించారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. గని వద్దకు చేరుకున్న ఆమె... అక్కడి సింగరేణి కార్మికులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత...ఇక వివాదాస్పద N-1 జీవోపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను టీబీజీకేఎస్ (TBGKS) అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో ఈ జీవో వచ్చిందని... అయితే అప్పట్లో ఆ జీవో గురించి తనకు సరైన అవగాహన లేదని ఆమె అంగీకరించారు. ప్రస్తుతం ఈ జీవో వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ‘బాయి బాట’ కార్యక్రమం ప్రారంభించిన తర్వాతే ఇతర పార్టీల నేతలకు సింగరేణి గుర్తొచ్చిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
తాము అధికారంలో ఉన్నప్పుడైనా, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ఎల్లప్పుడూ సింగరేణి కార్మికుల పక్షాన నిలబడ్డామని స్పష్టం చేశారు. సింగరేణికి అధికారులతో పాటు కార్మికులు కూడా రెండు కళ్ల లాంటి వారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సింగరేణిలో ఉద్యోగాలు చేస్తున్న యువతీ యువకులు లేబర్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు, సరైన యంత్రాలను, పనిముట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు టార్గెట్‌గా కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము సింగరేణి ప్రాంతంలో పర్యటించకుండా, రాజకీయంగా అడ్డుకోవడానికే మంత్రి శ్రీధర్ బాబు భారీగా పోలీసులను మోహరించారని మండిపడ్డారు. గతంలో కొమరం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేసే సమయంలోనూ శ్రీధర్ బాబు ఇలాగే అడ్డుకున్నారని ఆమె గుర్తు చేశారు. గత నాలుగు రోజులుగా సింగరేణి ప్రాంతంలో పోలీసులు అడ్డుకుంటున్నారని... అసలు సింగరేణి గనుల పైకి రాకుండా అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిదని నిలదీశారు
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తీరుపై కూడా కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు కార్మికుల సమస్యలను గాలికి వదిలేశారని... సీఎం రేవంత్ రెడ్డిని కాపాడటానికే బొగ్గు నిల్వలంటూ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయాలు ఏవైనా ఉంటే హైదరాబాద్‌లో కూర్చొని చేసుకోవాలని... గనుల మీదికి వచ్చి కార్మికుల సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు.
