న్యూఢిల్లీ, వెలుగు: వీ6 వెలుగు ఢిల్లీ ప్రతినిధి వంగ తిరుపతికి జాతీయ వాగ్దేవి పురస్కారం లభించింది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారె జయంతి సందర్భంగా జాతీయ తెలుగు సారస్వత పరిషత్ మంగళవారం ఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్‌లో ‘హస్తినలో తెలుగు–-వెలుగు’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులకు వాగ్దేవి అవార్డులు అందజేశారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అవార్డులను ప్రదానం చేశారు. మీడియా రంగంలో విశేష సేవలకు సాక్షి ఢిల్లీ ప్రతినిధి రాజశేఖర్‌కు వాగ్దేవి విశేష ప్రతిభా పురస్కారం అందించారు.
గత 12 ఏండ్లుగా ఢిల్లీ నుంచి పలు కీలక అంశాలపై వార్తలు అందిస్తున్న వీ6 వెలుగు ప్రతినిధి వంగ తిరుపతికి, ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి వేముల విద్యాసాగర్‌కు జాతీయ వాగ్దేవి పురస్కారాలు అందజేశారు. అలాగే మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, కాశీ విశ్వనాథరాజు పలువురికి వాగ్దేవి జీవిత సాఫల్య పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్, టీడీపీ ఎంపీలు బీద మస్తాన్‌రావు, మాగుంట శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
