మరోసారి నిజమైన V6 వెలుగు ఎగ్జిట్ పోల్స్

మరోసారి నిజమైన V6 వెలుగు ఎగ్జిట్ పోల్స్
  • అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నుంచి జూబ్లీహిల్స్ బైపోల్ దాకా
  •     వాస్తవాలకు అత్యంత దగ్గరగా అంచనాలు
  •     తాజా మున్సిపల్, కార్పొరేషన్ ఫలితాల్లోనూ అదే తీరు

హైదరాబాద్, వెలుగు: ఎగ్జిట్​పోల్స్​లో ‘వీ6 వెలుగు’ మీడియా సంస్థ మరోసారి తన విశ్వసనీయతను నిలబెట్టుకుంది. ఎన్నిక ఏదైనా సరే.. ఓటరు నాడిని కచ్చితంగా అంచనా వేయడంలో ఈ సంస్థ తనదైన ముద్ర వేస్తోంది. గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ వాస్తవ ఫలితాలకు అత్యంత దగ్గరగా అంచనాలను వెల్లడించిన ‘వీ6 వెలుగు’.. తాజా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లోనూ అదే పంథాను కొనసాగించింది.

వీ6 వెలుగు అంచనా వేసినట్టే.. 

తాజాగా వెల్లడైన మున్సిపల్, కార్పొరేషన్ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత  కనబరుస్తుందని వీ6 వెలుగు అంచనా వేసింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ 85 నుంచి 95 స్థానాలను కైవసం చేసుకుంటుందని, బీఆర్ఎస్ 15 నుంచి 20, బీజేపీ 2 నుంచి 5 స్థానాలకు పరిమితమవుతాయని వెల్లడించింది. ఎంఐఎం 2 చోట్ల గెలుస్తుందని తెలిపింది. ఇక 7 కార్పొరేషన్లకు గాను కాంగ్రెస్ 5 చోట్ల జెండా ఎగురవేస్తుందని, బీజేపీ ఒక్క స్థానంలో గెలుస్తుందని అంచనా వేసింది. మరో కార్పొరేషన్‌లో కాంగ్రెస్–బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని పేర్కొంది. ఫలితాలు కూడా అదే రీతిలో వెల్లడయ్యాయి. కాంగ్రెస్​ 85 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు కైవసం చేసుకున్నది.  

జూబ్లీహిల్స్ బైపోల్.. పక్కా లెక్క

గతంలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో అనేక ఎగ్జిట్ పోల్స్ వెలువడినప్పటికీ, తుది ఫలితాల సరళికి అత్యంత దగ్గరగా నిలిచింది మాత్రం ‘వీ6 వెలుగు’ సర్వేనే కావడం గమనార్హం. నాడు ఇతర సర్వేలన్నీ కాంగ్రెస్ అభ్యర్థికి 10 వేల లోపు మెజారిటీ ఉంటుందని, 50 శాతం లోపే ఓట్లు వస్తాయని అంచనా వేయగా.. వీ6 వెలుగు మాత్రం భిన్నంగా విశ్లేషించింది. కాంగ్రెస్ అభ్యర్థికి ఏకంగా 50 నుంచి 55 శాతం ఓటర్లు మొగ్గు చూపుతారని, బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య ఓట్ల తేడా దాదాపు 10 శాతం వరకు ఉంటుందని స్పష్టంగా చెప్పింది. ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆ మార్క్‌ను అందుకోవడం విశేషం.

2023 అసెంబ్లీ ఫలితాల్లోనూ..

2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ వీ6 వెలుగు అంచనాలు అక్షరాలా నిజమయ్యాయి. నాటి సర్వేలో కాంగ్రెస్‌కు 62–72 సీట్లు, బీఆర్ఎస్‌కు 38 నుంచి 46, బీజేపీకి 8 నుంచి 11 సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39 సీట్లు సాధించి ఆ అంచనాలను నిజం చేశాయి. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని 17 స్థానాలకు సంబంధించి వెల్లడించిన అంచనాలు కూడా గురితప్పలేదు. కాంగ్రెస్ 7 నుంచి 9 సీట్లు, బీజేపీ 7 నుంచి 9 సీట్లు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో ప్రకటించగా.. ఫలితాల్లో రెండు పార్టీలు చెరో 8 సీట్లను గెలుచుకోవడం ఈ సంస్థ సర్వేల కచ్చితత్వానికి నిదర్శనంగా నిలిచింది.