వడాపావ్ కు ప్రపంచ గుర్తింపు... టాప్-50 బెస్ట్ శాండ్‌విచ్ లిస్టులో

వడాపావ్ కు ప్రపంచ గుర్తింపు... టాప్-50 బెస్ట్ శాండ్‌విచ్ లిస్టులో

మహారాష్ట్ర ప్రజల ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ వడాపావ్ ప్రపంచ గుర్తింపు పొందింది. ఈ ఫుడ్ ‘ప్రపంచంలోని టాప్-50 బెస్ట్ శాండ్‌విచ్’ల జాబితాలో స్థానం సంపాదించుకుంది. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ అయిన ‘టేస్ట్ అట్లాస్’ ప్రకారం.. ప్రపంచంలోని బెస్ట్ శాండ్‌విచ్‌లలో వడాపావ్ 19వ స్థానంలో నిలిచింది. ఎంతో రుచికరమైన ఈ స్ట్రీట్ ఫుడ్‌ను చాలా మంది ఇష్టంగా తింటారు.   

టేస్ట్ అట్లాస్ లిస్టు ప్రకారం, వియత్నాం  బాన్ మి, టర్కీ టాంబిక్ డోనర్, లెబనాన్ షవర్మా, మెక్సికో టోర్టాస్, యునైటెడ్ స్టేట్స్ నుండి ఎండ్రకాయలు రోల్ ప్రపంచంలోని ఉత్తమ శాండ్‌విచ్‌లుగా టాప్ ఫైవ్ లో ఉన్నాయి.   జర్మనీకి చెందిన మెట్‌బ్రోచెన్, స్పెయిన్‌కు చెందిన బోకాడిల్లో డి సెర్డో, అర్జెంటీనాకు చెందిన సాంగుచే డి మిలనేసా, బీఫ్ ఆన్ వెక్ , యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన పోర్చెట్టా శాండ్‌విచ్‌లు ఈ జాబితాలో చివరి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

ఈ వడాపావ్ కు సృష్టికర్త  అశోక్ వైద్య అని చెబుతుంటారు.  ఆకలితో బాధపడుతున్న వారికి తన వంతు సహాయం అందించేందుకు ఆయన అతి తక్కువ ధరలో పూర్తయ్యే ఈ వంటకాన్ని చేసినట్లు తెలుస్తోంది. అంతే.. ఒక్కసారిగా ఈ స్నాక్ ఐటమ్ రుచి అందరికీ నచ్చడంతో కొద్ది రోజుల్లోనే వడాపావ్ చాలా ఫేమస్ గా మారింది.  దీనిని బాంబే బర్గర్ అని కూడా అంటారు. 

ఉడికించిన బంగాళాదుంపను మెత్తగా చేసి, తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, సుగంధ ద్రవ్యాలు (సాధారణంగా ఇంగువ, పసుపు) కలపాలి. దీన్ని ఉండగా చేసి, శనగ పిండిలో చుట్టి వేయించాలి. ఈ వడను, సగం చీల్చిన పావ్‌లో పెట్టి తింటారు. చట్నీలు, వేయించిన పచ్చిమిర్చిని ఇందులోకి నంజుకుంటారు.