SMAT 2025: మహారాష్ట్రపై 14 ఏళ్ళ కుర్రాడు విధ్వంసం.. సెంచరీతో సూర్యవంశీ ఆల్‌టైం రికార్డ్

SMAT 2025: మహారాష్ట్రపై 14 ఏళ్ళ కుర్రాడు విధ్వంసం.. సెంచరీతో సూర్యవంశీ ఆల్‌టైం రికార్డ్

వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐపీఎల్ లో 35 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచిన సూర్యవంశీ.. ఆ తర్వాత కూడా అస్సలు తగ్గేదే లేదంటూ చెలరేగిపోతున్నాడు. ఈ 14 ఏళ్ళ కుర్రాడు టోర్నీ ఏదైనా.. వేదిక ఎక్కడైనా.. ప్రత్యర్థి ఎవరైనా సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. ఇటీవలే అండర్ -19 రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఆసియా కప్‌లో యుఎఇపై 42 బంతుల్లో 144 పరుగులు చేసిన వైభవ్.. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శతకంతో మెరిశాడు.  

మంగళవారం (డిసెంబర్ 2) మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్ లో 58 బంతుల్లో సెంచరీ చేసి సత్తా చాటాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీ చేసిన అత్యంత చిన్న వయస్కుడిగా నిలిచాడు. ఆరంభంలో తమ జట్టు రెండు వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడిన వైభవ్.. ఆ తర్వాత బౌండరీల వర్షం కురిపించాడు. జట్టును ఒంటి చేత్తో  ముందుకు తీసుకెళ్లాడు. 58 బంతుల్లో సెంచరీ పూర్తి   చేసుకున్న వైభవ్.. ఓవరాల్ గా 61 బంతుల్లో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్యవంశీ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 7 సిక్సర్లున్నాయి. జట్టు స్కోర్ లో 70 శాతం ఈ టీనేజ్ కుర్రాడి రన్స్ ఉండడం విశేషం. ఈ టోర్నీలో తొలి మూడు మ్యాచ్ ల్లో సూర్యవంశీ విఫలమయ్యాడు. 

►ALSO READ | SMAT 2025: హార్దిక్ రూటే సపరేటు: గ్రౌండ్‌లో సెక్యూరిటీని ఆపి అభిమానికి సెల్ఫీ ఇచ్చిన పాండ్య

వరుసగా మూడు మ్యాచ్ ల్లో 14, 13, 5 పరుగులు చేసి నిరాశపరిచాడు. మహారాష్ట్రపై మాత్రం జూలు విదిల్చాడు. చాలా పరిణితిగా బ్యాటింగ్ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసినా వైభవ్ తన జట్టును గెలిపంచుకోలేకపోయాడు. మొదట బ్యాటింగ్ చేసిన బీహార్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సూర్యవంశీ మాత్రమే సెంచరీతో రాణించగా.. మిగిలిన వారు విఫలమయ్యారు. లక్ష్య ఛేదనలో మహారాష్ట్ర 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ పృథ్వీ షా 30 బంతుల్లోనే 11 ఫోర్లు, సిక్సర్ తో  66 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.