వైష్ణో దేవి టెంపుల్ తొక్కిసలాట ఘటనపై ఎంక్వైరీ

వైష్ణో దేవి టెంపుల్ తొక్కిసలాట ఘటనపై ఎంక్వైరీ
  • కాళ్ల కింద నలిగిన 12 ప్రాణాలు
  • జమ్ములోని వైష్ణోదేవి గుడిలో తొక్కిసలాట
  • భారీగా వచ్చిన భక్తులు.. కొందరు యువకుల మధ్య గొడవ
  • గందరగోళంతో క్షణాల్లోనే తొక్కిసలాట

జమ్ము/కటడా: కొత్త సంవత్సరం తొలి రోజే విషాదం జరిగింది. జమ్ము, కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 12 మందికిపైగా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది దాకా గాయపడ్డారు. భక్తులు భారీగా తరలిరావడం, కొందరు యువకుల మధ్య గొడవ జరగడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆఫీసర్లు చెప్పారు. మృతులకు రాష్ట్రపతి రామ్‌‌‌‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు సంతాపం తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఆఫీసర్లు వెంటనే స్పందించినా..

న్యూఇయర్ సందర్భంగా వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకునేందుకు త్రికూట కొండలపై ఉన్న గుడికి భారీగా భక్తులు వచ్చారు. కటడా బేస్‌‌‌‌ క్యాంప్ నుంచి అక్కడికి చేరుకున్నారు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో గర్భగుడి బయట గేట్ నంబర్ 3 దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఫ్లోర్‌‌‌‌‌‌‌‌పై నిద్రపోతున్న వాళ్లు కాళ్ల కింద నలిగిపోయారు. మృతుల్లో ఏడుగురు యూపీవాసులు, ముగ్గురు ఢిల్లీకి చెందిన వాళ్లు, జమ్ము కశ్మీర్, హర్యానాలకు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. 
‘‘కొందరు యువకుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. కొన్ని క్షణాల్లోనే అది తొక్కిసలాటకు దారితీసిందని మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గందరగోళం నెలకొనడంతో పోలీసులు, ఆఫీసర్లు వెంటనే స్పందించారు. భక్తులను కంట్రోల్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తొక్కిసలాటలో పలువురు చనిపోయారు’’ అని జమ్ము కాశ్మీర్ డీజీపీ దిల్‌‌‌‌బాగ్ సింగ్ చెప్పారు. 16 మందిని ఆస్పత్రికి తరలించగా.. అందులో ఆరుగురిని ట్రీట్‌‌‌‌మెంట్ చేసి పంపించేశారు.  ఇద్దరి పరిస్థితి సీరియస్​గా ఉన్నట్లు ఆఫీసర్లు చెప్పారు.  డెడ్‌‌‌‌ బాడీలను కటడా బేస్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు వివరించారు.

ఎల్జీతో మాట్లాడిన ప్రధాని

జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, నిత్యానంద్ రాయ్‌‌‌‌తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ‘‘ఘటన గురించి ప్రధానితో మాట్లాడాను. అన్ని విధాలుగా సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షలు, గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌‌‌‌గ్రేషియా ఇస్తాం. గాయపడ్డ వారికి ఇచ్చే ట్రీట్‌‌‌‌మెంట్ ఖర్చులను ఆలయ బోర్డే భరించాలి” అని ఎల్జీ స్పష్టంచేశారు. ప్రధాన మంత్రి కార్యాలయంకూడా బాధితులకు నష్టపరిహారం ప్రకటించింది. మృతుల బంధువులకు2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది. 

ఏడు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలె

తొక్కిసలాట తర్వాత కూడా భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరిచే ఉంచారు. అయితే ప్రమాదం వల్ల భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి ఎదురుచూశారు. చాలామంది దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. మృతదేహాలను వారి సొంత ఊర్లకు పంపిస్తున్నామని జమ్మూ డివిజనల్ కమిషనర్ రాఘవ్ లంగర్ తెలిపారు. జమ్ము ఏడీజీపీ ముకేశ్ సింగ్​తో కలిసి ఆయన కటడాకు వచ్చారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేసేందుకు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. ఈ కమిటీలో రాఘవ్ లంగర్, ముకేశ్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. ఏడు రోజుల్లోపు ఎంక్వైరీ పూర్తి చేసి నివేదిక అందజేయాలని జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తొక్కిలాటకు కారణాలను తేల్చడంతో పాటు ఎక్కడ లోపం జరిగింది?, దానికి ఎవరిని బాధ్యులను చేయాలన్నది సవివరంగా రిపోర్ట్‌లో పొందుపరచాలని ఆదేశించింది.

ఏర్పాట్లు సరిగ్గా చేయలే..

ఆలయ అధికారులు ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఘటన నుంచి బయటపడ్డవాళ్లు చెప్పారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టలేదని తెలిపారు. ‘‘దుర్ఘటనకు మిస్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్ తప్ప ఇంకోటి కారణం కాదు. రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆఫీసర్లకు తెలుసు. కానీ అడ్డూఅదుపూ లేకుండా భక్తులందరినీ అనుమతించారు” అని యూపీలోని ఘజియాబాద్‌‌‌‌కు చెందిన ఓ భక్తుడు చెప్పాడు. తమ బంధువు డెడ్‌‌‌‌బాడీ కోసం మార్చురీ ఎదుట ఎదురు చూస్తున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. యాత్రకు బాధ్యతతో ఏర్పాట్లు చేసి ఉంటే.. 12 మంది చనిపోయే వారు కాదని మరో యాత్రికుడు అన్నాడు. ‘‘దుర్ఘటనకు కొన్ని నిమిషాల ముందు కూడా భక్తుల మధ్య కలకలం రేగింది. కానీ అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. పరిస్థితి కంట్రోల్‌‌‌‌లోకి వచ్చింది. అయితే దర్శనం అయ్యాక చాలా మంది వెళ్లిపోలేదు. అక్కడే నేలపైనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో అక్కడ మరింత రద్దీ ఏర్పడింది. గుడిలోనికి వచ్చేటోళ్లు, బయటికి వెళ్లేటోళ్లతో గందరగోళం నెలకొంది. ఆ సమయంలోనే తొక్కిసలాట జరిగింది” అని తెలిపాడు.