కలెక్టరేట్ ఎదుట వజినేపల్లి భూ బాధితుల నిరసన

కలెక్టరేట్ ఎదుట వజినేపల్లి భూ బాధితుల నిరసన

సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామ సర్వే నంబర్ 52కు చెందిన భూ బాధితులు తమకు జరుగుతున్న అన్యాయంపై కలెక్టరేట్​ ఎదుట నిరసనకు దిగారు. నెమలిపురి, వజినేపల్లి గ్రామాల నక్షాలు ఓవర్ ల్యాప్ అయ్యాయనే నెపంతో సరిహద్దు వివాదం తేలే వరకు కొత్త పాస్ బుక్కులు ఇవ్వలేమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారని, ఈ వివరాలను సవరించడానికి పై అధికారుల నుంచి అనుమతి వచ్చి మూడున్నరేండ్లు గడుస్తున్నా నేటికీ సమస్య పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఓవర్ ల్యాప్ సాకుతో కొందరు అటవీ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయమై రెవెన్యూ శాఖ ఓవర్ ల్యాప్ ఉందని చెబుతుంటే అటవీశాఖ లేదని అంటోందని, ఒక్క రోజులో తేలాల్సిన ఈ చిన్న సమస్యపై కలెక్టర్ కాలయాపన చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తమకు తక్షణమే న్యాయం జరగకపోతే నిరాహార దీక్ష చేపట్టడానికైనా, పాదయాత్రగా వెళ్లి ముఖ్యమంత్రిని కలవడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు.