
అమరావతి, వెలుగు: టీడీపీకి ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, ఇక నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్ తో కలిసి నడుస్తానని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే వైఎస్సార్ సీపీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసైనా జగన్ సర్కారుకు సపోర్ట్ చేస్తానన్నారు. 1995 నుంచి జగన్‌తో తనకు పరిచయముందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ తనకు సాయం చేశారన్నారు. గురువారం సాయంత్రం విజయవాడలోని నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. “టీడీపీ ఆవిర్భావం తర్వాత పొత్తులు లేకుండా ఎప్పుడూ ఎన్నికలకు వెళ్లలేదు. ఎన్నికలకు మందు ఒక మాట, తర్వాత ఒక మాట మాట్లాడితే ప్రజలు నమ్మరు. 2009లో ఏటీఎం కార్డులు పంచినా ప్రతిపక్ష స్థానమే దక్కింది. పొత్తులు పెట్టుకోవడానికి ఏ పార్టీలు మిగల్లేదు. కావాలంటే జనసేన లాంటి కొత్త పార్టీలను పుట్టించాలి” అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి పురిటి వాసన కూడా పోకుండానే ప్రతిపక్షాలు దీక్షలు చేస్తున్నాయని, రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి పాత్రలో ఫెయిల్ అయ్యారని విమర్శించారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరుపున ప్రచారం చేసి పదేళ్లలో ఎప్పుడూ కనిపించలేదన్నారు.