పారిస్: మహిళా అంపైర్‌పై లింగవివక్ష వ్యాఖ్యలు చేసిన పరాగ్వే టెన్నిస్ ఆటగాడు అడాల్ఫో డానియల్ వల్లేజోకు ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు 65,000 యూరోల (రూ.61 లక్షలు) జరిమానా విధించారు. ఫ్రాన్స్ యువ ఆటగాడు మోయిస్ కౌమే చేతిలో ఓడిన అనంతరం వల్లేజో మాట్లాడుతూ.. తీవ్రమైన ఒత్తిడి ఉండే ఇలాంటి మ్యాచ్‌లకు పురుషులే అంపైరింగ్ చేయాలని, మహిళలకు ప్రేక్షకులను అదుపు చేయడం కష్టమని వ్యాఖ్యానించాడు.
దీనిపై రోలాండ్ గారోస్ డైరెక్టర్ అమలీ మౌరెస్మో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేస్తూ, వల్లేజోకు దక్కాల్సిన రెండో రౌండ్ ప్రైజ్ మనీ (1,30,000 యూరోలు) లో సగాన్ని జరిమానాగా విధిస్తున్నట్లు ప్రకటించారు.
