- కాన్స్టిట్యూషన్పై నేతలకు పరీక్ష పెట్టాలి: ఎంపీ వంశీకృష్ణ
- రాజ్యాంగ పీఠికపై అంబేద్కర్ లా కాలేజీలో నిర్వహించిన సదస్సుకు హాజరు
ముషీరాబాద్, వెలుగు: రాజ్యాంగాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షుణ్ణంగా చదవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. రాజ్యాంగంపై లీడర్లకు పరీక్ష పెట్టాలని తెలిపారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీలో రాజ్యాంగ పీఠికపై బుధవారం సదస్సు జరిగింది. సమిట్కు నల్సార్ యూనివర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావుతో కలిసి ఎంపీ వంశీకృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వంశీకృష్ణ మాట్లాడారు. ‘‘గొప్ప ఆశయంతో అంబేద్కర్ విద్యా సంస్థలను కాకా నెలకొల్పారు. అందుకు విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి. చదువుతో పాటు చట్టాలు.. సమాజంలో జరుగుతున్న నేరాలను లా విద్యార్థులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి’’అని వంశీకృష్ణ సూచించారు.
రాజ్యాంగానికి మూలం రూల్ ఆఫ్ లా అని నల్సార్ వీసీ శ్రీకృష్ణదేవరావు అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. లా విద్యార్థులు చురుగ్గా ఉంటూ ప్రాక్టికల్స్ చేసి చూపించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ పీఠికపై ఇచ్చిన ప్రజెంటేషన్ పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను బహుమతులను ప్రదానం చేశారు.
కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ పీవీ రమణ కుమార్, సీఈవో లింబాద్రి, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.సృజనతో పాటు ఫ్యాకల్టీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
