నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలి : పొన్నం ప్రభాకర్

నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలి : పొన్నం ప్రభాకర్

ఉప్పల్, వెలుగు: నాటి ప్రతి మొక్కను కాపాడుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్​సూచించారు. గ్రీనరీని పెంచడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సోమవారం రామాంతపూర్ గవర్నమెంట్​పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించిన ‘వన మహోత్సవం’ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలనే లక్ష్యంతో వనమహోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 30 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు.

సోమవారం ఒక్కరోజే 30 సర్కిల్లోని 56 లొకేషన్లలో 7,134 మొక్కలు నాటేందుకు సిద్ధం చేశామన్నారు. మొక్కలు నాటడాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ టార్గెట్​30 లక్షల మొక్కలు అయినప్పటికీ, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 60 లక్షల మొక్కలను సిద్ధం చేశామని తెలిపారు. ఏటా సిటీలో గ్రీనరీ శాతాన్ని పెంచుతున్నామని చెప్పారు. కాలేజీలు, ఖాళీ స్థలాలు, పార్కులు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్ రెడ్డి, బల్దియా కమిషనర్ ఆమ్రపాలి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, అడిషనల్ కమిషనర్ సునంద, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు  తదితరులు పాల్గొన్నారు.