Taste Food: వెరైటీ సమోసాలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా.. ఎలా తయారు చేయాలంటే..!

Taste Food:  వెరైటీ  సమోసాలు..  రుచితో పాటు ఆరోగ్యం కూడా.. ఎలా తయారు చేయాలంటే..!

రోజంతా పనిలో అలసిపోయినప్పుడు... సాయంత్రం రెండు సమోసాలు తిని, కప్పు చాయ్ తాగితే ఆ మజానే వేరు.గంటలుగా పడిన శ్రమ నిమిషాల్లో మాయమవుతుంది. అయితే బయట దొరికే సమోసాలు రెగ్యులర్​ గా  తింటే ఆరోగ్యం చెడిపోవచ్చు. అందుకే ఇంట్లోనే తయారు చేసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యమూ బాగుంటుంది. కానీ ఎప్పుడై ఒకే రకమైనవి కాకుండా... వెజ్​ నాన్​ వెజ్​ సమోసాలను ట్రై చేయాలి. అదెలాగంటారా..? ఇదిగో ఇలాగే...!

కార్న్ సమోసా తయారీకి కావలసినవి

  • స్వీట్ కార్న్- 1 కప్పు
  • ఉల్లిగడ్డ తరుగు–1/4 కప్పు
  • పచ్చిమిర్చి తరుగు 1 టీ స్పూన్
  • ఉప్పు- తగినంత
  • పసుపు - చిటికెడు
  • కారం–1/4  టీ స్పూన్
  • కరివేపాకు- 1 రెమ్మ
  • కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూన్
  • ఆమ్ చూర్ పౌడర్- మార్కెట్లో
  • దొరుకుతుంది)- 1/4 టీ స్పూన్
  • మైదా లేదా గోధుమ పిండి –ఒకకప్పు
  • నూనె – సరిపడా

తయారీ విధానం: ఒక గిన్నెలో మైదా లేదా గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, సరిపడా నీళ్లుపోసి మెత్తగా కలిపి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్​ పై పాన్​ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు వేసి కలపాలి. ఉడికించిన స్వీట్ కార్న్ కూడా వేయాలి. అందులో ఉప్పు, పపుపు కారం, ఆమ్ చూర్ పౌడర్, కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసి ఐదు నిమిషాలు వేగించాలి. ముందుగా కలుపుకున్న మైదా లేదా గోధుమ పిండితో చిన్నసైజు పూరీల్లా ఒత్తాలి. వాటి మధ్యలో కార్న్ మిశ్రమాన్ని పెట్టి సమోసా ఆకారంలో మడవాలి. చివరగా వాటిని నూనెలో డీప్​ ఫ్రై చేయాలి. 

మటన్ కీమాతో సమోసా తయారీకి కావలసినవి

  • ఉడికించిన మటన్ కీమా - 1/2 కప్పు
  • ఉడికించిన పచ్చి బఠాణీలు- 1/4కప్పు
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్-1/2 టీ స్పూన్
  • పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూన్ 
  • కొత్తిమీర తరుగు- టేబుల్ స్పూన్
  • పసుపు-చిటికెడు 
  • కారం- రుచికి తగినంత
  • ఉల్లిగడ్డ 1తరుగు- టేబుల్ స్పూన్
  • ధనియాల పొడి - 2 టీ స్పూన్లు
  •  గరం మసాలా- 1 టీస్పూన్
  • జీలకర్ర పొడి 1 టీ స్పూన్
  • ఉప్పు - తగినంత 
  • నూనె - సరిపడా
  • మైదా లేదా గోధుమ పిండి -1 కప్పు

తయారీ విధానం: ఒక గిన్నెలో మైదా లేదా గోధుము పిండి ఉప్పు, కొద్దిగా నూనె, సరిపడా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. స్టవ్​ పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో ఉల్లిగడ్డ తరుగు, అల్లం-వెలుల్లి పేస్ట్ పసుపు వేసి కలపాలి. తర్వాత మటన్ కీమా, పచ్చి బఠాణీలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేయాలి. ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర తరుగు చల్లి దింపేయాలి. మైదా లేదా గోధుమ పిండిని కొద్దికొద్దిగా తీసుకొని, చిన్నసైజు పూరీల్లా ఒత్తాలి. అందులో కీమా మిశ్రమాన్ని పెట్టి.. సమోసా ఆకారంలో విడవాలి. వాటిని నూనెలో డీప్​ ఫ్రై చేయాలి.

ALSO READ : ది రాజాసాబ్ Vs వార్ 2 : ప్రీ బాక్సాఫీస్ లో హీటెక్కిన ఫ్యాన్స్ వార్!

చికెన్ సమోసాతో సమోసా తయారీకి కావలసినవి

  • చికెన్-1 కప్పు
  • కారం- 1 టీ స్పూన్లు
  • గరం మసాలా- 1 టీ స్పూన్
  • పసుపు- 1/2 టీ స్పూన్
  • మిరియాల పొడి-1/2 టీస్పూన్
  • ధనియాల పొడి -2 టీ స్పూన్లు
  • ఉప్పు- తగినంత 
  • నూనె - సరిపడా
  • ఉల్లిగడ్డ తరుగు - 1/4 కప్పు
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్- 2టీ స్పూను
  • వచచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూన్
  • మైదా లేదా గోధుము పిండి- 2 కప్పులు

తయారీ విధానం:  ముందుగా చికెన్ కొద్దిగా నీళ్లు ఉప్పు, పసుపులో ఉడికించి కచ్చాపచ్చాగా రుబ్బాలి. అలాగే మైదా లేదా గోధుమ పిండిలో ఉప్పు, సరిపడా నీళ్లు పోసి, కలపాలి. స్టవ్​పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. ఉల్లిగడ్డ తరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. అందులో చికెన్ మిశ్రమాన్ని వేయాలి.. రెండు నిమిషాల తర్వాత మిరియాలు పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి ఆ మిశ్రమాన్ని మైదా లేదా గోధుమ పిండితో చేసిన పూరీలలో పెట్టి... సమోసా ఆకారంలో మడవాలి. చివరగా వాటినీ నూనెలో డీప్​ ఫ్రై చేయాలి.

ఆలూ- బఠాణీ తో సమోసా తయారీకి కావాల్సినవి

  • మైదా లేదా గోధుమ పిండి- 1/4 కప్పు
  • ఉప్పు- తగినంత
  • ఉడికించి మెదిపిన ఆలుగడ్డ- ఒక కప్పు
  • ఉడికించిన పచ్చి బఠాణీలు - పావు కప్పు
  • కారం- సరిపడా 
  • పచ్చిమిర్చి తరుగు -1టీ స్పూన్
  • జీలకర్ర- 1/2 టీ స్పూన్
  •  పసుపు - చిటికెడు
  • గరం మసాలా- టీ స్పూన్
  • చాట్ మసాలా- 1టీ స్పూన్
  • నూనె- సరిపడా

తయారీ విధానం: ఒక గిన్నెలో మైదా లేదా గోధుమ పిండి ఉప్పు , కొద్దిగా నూనె, సరిపడా నీళ్లు పోసి మెత్తగా కలిపి పక్కన పెట్టాలి. స్టవ్​ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, పసుపు వేసి కలపాలి. తర్వాత అలుగడ్డ మిశ్రమం, ఉడికించిన పచ్చి బఠాణీలు, పల్లీలు, కారం, ఉప్పు వేయాలి. మూడు నిమిషాల తర్వాత మిశ్రమం బాగా మగ్గాక స్టవ్ ఆపేయాలి. తర్వాత మైదా లేదా గోధుమ పిండితో చిన్నసైజు పూరీలుగా చేసి, వాటి మధ్యలో అలూ మిశ్రమంపెట్టాలి. తర్వాత సమోసా ఆకారంలో మడిచి నూనెలో డీప్​ ఫ్రై చేయాలి.