వర్సిటీ ఈసీ నామినీల్లో అనర్హులు! రీ చెక్ చేస్తున్న విద్యాశాఖ ఆఫీసర్లు

వర్సిటీ ఈసీ నామినీల్లో అనర్హులు! రీ చెక్ చేస్తున్న విద్యాశాఖ ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు : యూనివర్సిటీ వీసీ పోస్టుల కోసం సెర్చ్ కమిటీల ఏర్పాటులో విద్యాశాఖ నిమగ్నమైంది. అయితే, ఇటీవలే పది యూనివర్సిటీల్లో ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి, వాటిలో వర్సిటీ తరఫున నామినీని ఎంపిక చేశారు. ఆ పేర్లను విద్యాశాఖకు పంపించారు. దీంట్లో సీవీ ప్రసాద్ (ఉస్మానియా), భట్టు సత్యనారాయణ (పాలమూరు), సాయన్న (శాతవాహన), సులేమాన్ సిద్ధిఖీ (తెలంగాణ), తిరుపతిరావు (పొట్టి శ్రీరాములు తెలుగు) తదితరుల పేర్లు ఖరారయ్యాయి. జేఎన్టీయూకు మైసూర్ వర్సిటీ మాజీ వీసీని, అంబేద్కర్ వర్సిటీకి ఇతర రాష్ర్టాల్లోని ఓపెన్ వర్సిటీల్లో పనిచేసిన ముగ్గురు మాజీ వీసీ పేర్లను ప్రతిపాదించినట్టు తెలిసింది.

అయితే, ఈ నామినీల్లో కొందరు వీసీ పోస్టులకు అప్లై చేసిన వారు, గతంలో ఆ వర్సిటీలో పనిచేసిన వారు ఉన్నట్టు విద్యాశాఖ గుర్తించింది. దీంతో మరోసారి వాటిని వెరిఫై చేయాలని నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారిపేర్లను తొలగించి, మళ్లీ కొత్తగా ఈసీ నామినీలను పెట్టనున్నారు. మరోపక్క ఇప్పటికే 10 యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీల్లో యూజీసీ నామినీ పేర్లూ విద్యాశాఖకు చేరాయి. దీంతో సర్కారు నామినీని జత చేసి, ప్రతి వర్సిటీకి ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీలను వేయనున్నారు. సర్కారు నామినీగా దాదాపు విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉండే అవకాశం ఉంది. త్వరలోనే సెర్చ్ కమిటీలను సర్కారు ప్రకటించే అవకాశం ఉంది.