బాసరలో ఘనంగా వసంత పంచమి.. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

బాసరలో ఘనంగా వసంత పంచమి.. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

భైంసా/బాసర, వెలుగు : నిర్మల్‌‌ జిల్లా బాసర సరస్వతీ ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి జన్మదినం, వసంత పంచమి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేకపూజల్లో భాగంగా తెల్లవారుజామున 2.30 గంటలకు సరస్వతీ దేవికి అభిషేక సేవతో ఉత్సవం ప్రారంభమైంది. 

బీజేఎల్పీ నేత, నిర్మల్‌‌ ఎమ్మెల్యే మహేశ్వర్‌‌రెడ్డి, ముథోల్‌‌ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఎండోమెంట్‌‌ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌‌, కలెక్టర్‌‌ అభిలాష అభినవ్‌‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వసంత పంచమి సందర్భంగా తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక నుంచి గురువారం రాత్రే బాసర చేరుకున్న భక్తులు అర్ధరాత్రి నుంచే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. 

అనంతరం తెల్లవారుజామున 4 గంటల నుంచే క్యూలైన్లలో బారులుదీరారు. రద్దీ కారణంగా అమ్మవారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పట్టింది. లక్ష మందికిపైగా భక్తులు వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. భక్తుల రద్దీకారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్పీ జానకీ షర్మిల, భైంసా ఏఎస్పీ రాజేశ్‌‌ మీన ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. 

భక్తుడికి గుండెపోటు.. సీపీఆర్​ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్‌‌

అమ్మవారి దర్శనం కోసం క్యూలో ఉన్న మంచిర్యాల జిల్లాకు చెందిన సిద్ధం తిరుపతి అనే భక్తుడు గుండెపోటుతో ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు ఇంద్రకరణ్‌‌రెడ్డి, గణేశ్‌‌, నారాయణ స్పందించి బాధితుడికి సీపీఆర్‌‌ చేసిన అనంతరం అంబులెన్స్‌‌లో హాస్పిటల్‌‌కు తరలించి ప్రాణాలు కాపాడారు. హోంగార్డులతో పాటు వైద్య సిబ్బందిని పలువురు అధికారులు, భక్తులు అభినందిచారు.