- సభలో ప్రవేశపెట్టిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్
- గాంధీ పేరు తొలగింపుపై ప్రతిపక్షాల మండిపాటు
- వెల్‌లోకి దూసుకొచ్చి కాంగ్రెస్, ఇతర పార్టీ నేతల నిరసనలు
- బిల్లును పార్లమెంటరీ ప్యానెల్ పరిశీలనకు పంపాలని డిమాండ్
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ జీఆర్ఈఏ) స్థానంలో కొత్త చట్టాన్ని తెచ్చేందుకు రూపొందించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్(వీబీ–జీ రామ్ జీ) బిల్లు, 2025ను కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. మంగళవారం ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మహాత్మా గాంధీ పట్ల ఎంతో విశ్వాసం ఉందని, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తుందన్నారు. గత ప్రభుత్వాల కన్నా మోదీ సర్కారు గ్రామీణాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిందన్నారు. అయితే, కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త బిల్లుపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పథకం పేరులోంచి గాంధీ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసనలు తెలిపారు. కాగా, వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా ఈ బిల్లును రూపొందించినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. ఎంఎన్ జీఆర్ఈఏలో ఉన్న నిర్మాణాత్మక లోపాలను సవరిస్తూ, ఉపాధి, పారదర్శకత, ప్రణాళిక, జవాబుదారీతనాన్ని పెంచేలా మార్పులు చేసినట్టు పేర్కొంది. ఈ చట్టంలో పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచాలని ప్రతిపాదించామని వెల్లడించింది. జల భద్రత కోసం, గ్రామాల్లో కీలక మౌలిక వసతుల కల్పన, జీవనాధారం పెంపు, తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్పెషల్ వర్క్‌ల కోసం ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు వివరించింది.
రాముడి పేరును బద్నాం చేయొద్దు: శశి థరూర్
కేంద్రం తెచ్చిన వీబీ–జీ రామ్ జీ బిల్లు కేవలం పాలనాపరమైన మార్పు కాదని.. పథకం ఉద్దేశాన్నే దెబ్బతీసేలా ఉందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. ‘‘ఈ బిల్లు దేశానికి పూర్తిగా తిరోగమన చర్య. గాంధీజీ రామ రాజ్యం విజన్ అనేది పల్లెల సాధికారత కోసం ఒక సామాజిక, ఆర్థిక బ్లూప్రింట్ మాదిరిగా ఉండేది. ఆయన కోరుకున్న గ్రామ స్వరాజ్యం అనే భావన రాజ రాజ్యం అనే విజన్‌లో భాగం” అని అన్నారు. ఈ సందర్భంగా రాముడి పేరును బద్నాం చేయొద్దంటూ ‘దేఖో ఓ దీవానో.. యే కామ్ న కరో, రామ్ కా నామ్ బద్నాం న కరో’ అనే బాలీవుడ్ సాంగ్‌ను ఆయన గుర్తు చేశారు.
పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల ఆందోళన
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త చట్టం తేవడానికి ప్రవేశపెట్టిన వీబీ-–జీ రామ్ జీ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తొలగించడం అంటే.. మహాత్మా గాంధీని అవమానించడమేనని మండిపడ్డాయి. మంగళవారం లోక్ సభలో నిరసనలు తెలిపిన కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు అనంతరం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ వద్ద ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ, గడ్డం వంశీకృష్ణ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, ఆర్ఎస్పీ ఎంపీ ప్రేమ్ చంద్రన్, తదితరులు ప్లకార్డులు ప్రదర్శించి నిరనసలు తెలిపారు.
