పని కల్పించకుంటే భృతి.. కూలి పైసలు లేటైతే వడ్డీ!

పని కల్పించకుంటే భృతి.. కూలి పైసలు లేటైతే వడ్డీ!
  •     వీబీ జీ రామ్​ జీ స్కీమ్​లో 15 రోజుల్లో
  •     పని చూపించకుంటే నిరుద్యోగ భృతి
  •     కూలి డబ్బులు లేటైతే రోజుకు 0.05 శాతం వడ్డీ
  •     కూలీలకు ఏటా 125 రోజుల పని గ్యారంటీ
  •     వీబీ జీ రామ్​ జీపై గెజిట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ)’ పథకం రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. 2025 చట్టానికి తగ్గట్టుగా రూపొందించిన ఈ నూతన ఉపాధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది.పాత ఉపాధి హామీ పథకంలోని లోపాలను సవరిస్తూ.. అత్యాధునిక సాంకేతికతను జోడించి గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చేలా నిబంధనలను రూపొందించింది. 

ఇందులో భాగంగా  పనుల కల్పనలో జాప్యం జరిగినా, వేతనాల చెల్లింపులో ఆలస్యమైనా ప్రభుత్వం జరిమానా చెల్లించేలా కఠిన నిబంధనలను పొందుపరిచింది.  పని కల్పించకుంటే సర్కార్ పైనే భారం పడనున్నది. పని కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపు కూలీలకు కచ్చితంగా పని చూపించాలి. ఒకవేళ ప్రభుత్వం నిర్ణీత సమయంలో పని కల్పించడంలో విఫలమైతే, ఆ దరఖాస్తుదారులకు నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది. ఈ భృతి మొదటి 30 రోజులకు కనీస వేతనంలో నాలుగో వంతు, ఆ తర్వాత సగం వరకు ఉంటుంది. పని కల్పించడంతోపాటు చేసిన పనికి వేతనం చెల్లించడంలోనూ ప్రభుత్వం జాప్యం చేయడానికి వీల్లేదు. మస్టర్ రోల్ క్లోజ్ అయిన 15 రోజుల్లోపు కూలీల ఖాతాల్లో డబ్బులు జమ కావాలి. ఒకవేళ అది దాటితే.. ఆలస్యమైన ప్రతి రోజుకు 0.05 శాతం చొప్పున వడ్డీతో కలిపి పరిహారం చెల్లించాలని గెజిట్‌‌లో స్పష్టం చేశారు.

పనుల పర్యవేక్షణకు సీఎం అధ్యక్షతన కౌన్సిల్

వీబీ జీ రామ్​ జీ పనుల ఎంపికలో గ్రామసభ నిర్ణయమే కీలకం కానుంది. ఏ పని కూడా కాంట్రాక్టర్ల ద్వారా చేయించకూడదని, కేవలం కూలీల ద్వారానే పనులు సాగాలని నిబంధన విధించారు. యంత్రాల వాడకాన్ని పూర్తిగా నియంత్రించి, మ్యాన్యువల్ పనులకే మొగ్గు చూపనున్నారు. ఈ పథకం పర్యవేక్షణ కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన ‘తెలంగాణ స్టేట్ గ్రామీణ రోజ్‌‌గార్ గ్యారంటీ కౌన్సిల్’ ఏర్పాటవుతుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్లుగా బాధ్యతలు నిర్వహిస్తారు. నిధుల విషయానికొస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఖర్చును భరిస్తాయి. 

ప్రతి ఆరు నెలలకోసారి సామాజిక తనిఖీ నిర్వహించడం తప్పనిసరి. పనుల్లో అక్రమాలు జరిగినా, నిధులు దుర్వినియోగమయినా రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతి జిల్లాకు అంబుడ్స్‌‌పర్సన్‌‌ను నియమించి, ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించేలా యంత్రాంగాన్ని రెడీ చేశారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఏడాదికి 125 రోజుల పనిని ప్రభుత్వం గ్యారంటీగా ఇస్తోంది. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందినవారు, ట్రాన్స్‌‌జెండర్లు, ఆదిమ తెగలకు ‘స్పెషల్ గ్రామీణ రోజ్‌‌గార్ గ్యారంటీ కార్డుల’ను జారీ చేయనున్నారు.