
సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘వేదవ్యాస్’. కె.అచ్చిరెడ్డి సమర్పణలో కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. గురువారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, దర్శకులు వీవీ వినాయక్, అనిల్ రావిపూడి, నటులు మురళీ మోహన్, అలీ, సాయికుమార్, నిర్మాత జెమినీ కిరణ్ అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు.
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రేక్షకుల ప్రేమాభిమానాలు, ఆదరణ, అభినందనలతో 42 చిత్రాలు పూర్తి చేసిన నేను త్వరలో 43వ చిత్రంగా ‘వేదవ్యాస్’తో మీ ముందుకు రాబోతున్నాను. ఈ చిత్రంతో తొలిసారి తెలుగు మూవీలో ఒక కొరియన్ హీరోయిన్‌ను పరిచయం చేస్తున్నాం’ అన్నారు. కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ ‘ఇది కృష్ణారెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. దీనికోసం కొరియన్ హీరోయిన్‌ను, మంగోలియన్ విలన్‌ను తీసుకున్నాం. హీరో ఎవరు అనేది మరో వారం రోజుల్లో వెల్లడిస్తాం.
కమర్షియల్ ఎలిమెంట్స్, మెసేజ్‌తో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’ అని చెప్పారు. ఇండియన్ కల్చర్ నేర్చుకుని ఈ సినిమాలో నటిస్తుండటం పట్ల జున్ హ్యున్ జీ సంతోషం వ్యక్తం చేసింది. నిర్మాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ‘కృష్ణారెడ్డి గారి సినిమాలు మంచి వినోదం, సందేశంతో కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటాయి. ఆయనపై అభిమానంతోనే నిర్మాతను అయ్యాను. మా కాంబినేషన్‌లో ఇలాంటి మరిన్ని చిత్రాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు.