దమ్మంటే.. కూరగాయలు కొనండీ చూద్దాం.. ఏంటీ ఇంత మాట అనేశారు.. ఆ మాత్రం కూరగాయలు కూడా కొనుక్కోలేని దుస్థితిలో జనం ఉన్నారని అనుకుంటున్నారా.. ఇలాంటి డైలాగ్స్ రావటం సహజం. అయితే ఒక్కసారి మార్కెట్ కు వెళ్లి.. కూరగాయలు కొనటం మొదలుపెడితే అప్పుడు కనిపిస్తుంది.. అసలు సిసలు సినిమా. అవునండీ.. ఆ రేంజ్ లో ఉన్నాయి రేట్లు.. ఏది పట్టుకున్నా రిటైల్ మార్కెట్ లో కిలో వంద రూపాయలు తగ్గటం లేదు.. ఇంతకీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం..
పచ్చి మిర్చి కిలో 160 రూపాయలు, బీన్స్ కిలో 160 రూపాయలు, టమాటా కిలో 100 రూపాయలు, బీరకాయలు కిలో 80 రూపాయలు, కాకరకాయలు కిలో 80 రూపాయలు, క్యాప్సికం కిలో 80 రూపాయలు, క్యారెట్ కిలో 60 రూపాయలు, వంకాయ కిలో 60 రూపాయలు, బెండకాయలు కిలో 60 రూపాయలు, క్యాలిఫ్లవర్ ఒకటి.. కేవలం ఒకటి 50 రూపాయలు, సొరకాయ ఒకటి 40 రూపాయలు, పొట్లకాయ ఒకటి 40 రూపాయలు, పొటాటో అదేనండీ ఆలుగడ్డ కిలో 30 రూపాయలు.
ఆగండి ఆగండీ.. ఇంతటితో అయిపోలేదు.. అల్లం కిలో 300 రూపాయలు, వెల్లుల్లి కిలో 250 రూపాయలుగా ఉన్నాయి ధరలు. ఇవన్నీ హోల్ సేల్ మార్కెట్ రేట్లు.. బండ్ల, ఇళ్ల దగ్గర షాపుల్లో అయితే మరో 10, 20 రూపాయలు ఎక్కువగానే ఉంటుంది..
పైన రేట్లు అన్నీ క్వాలిటీ కూరగాయలు.. ఒక రోజు, రెండు రోజులుగా నిల్వ ఉన్న కూరగాయలు అయితే ఓ 10, 20 రూపాయలు తక్కువగానే వదిలించుకుంటున్నారు వ్యాపారులు. ఏది ఏమైనా ఏ కూరగాయ అయినా.. పట్టుకుంటే చాలు వంద రూపాయలు తక్కువ ఉండటం లేదు. ఇంత రేట్లు పెట్టి ఎన్ని కొనాలి.. ఎలా తినాలనే దిగులు పట్టుకుంది మధ్యతరగతి, సామాన్యులకు. తినటం తప్పదు కాబట్టి.. ఏదో కొంచెం కొనుక్కుని.. నాలుగు పచ్చళ్లతో లాగించేస్తున్నారు జనం.
ఇప్పుడు చెప్పండి.. ఈ రేట్లు విన్న తర్వాత కూడా డోంట్ కేర్ అని కూరగాయలు కిలోలకు కిలోలు కొనే దమ్ము ఉందంటారా సామాన్యులు, మధ్య తరగతి జనానికి...
