వెహి‘కిల్’​@15 ఇయర్స్

వెహి‘కిల్’​@15 ఇయర్స్

కాలం చెల్లిన వాహనాలకు చెక్
పొల్యూషన్ ను తగ్గించేందుకు అధికారుల నిర్ణయం
ఆర్ సీ రెన్యువల్ రేట్లను పెంచేందుకు నిర్ణయం
ప్రభుత్వానికి ప్రతిపాదనలు

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న కాలం చెల్లిన వెహికల్స్ కారణంగా వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ కాలుష్యం వల్ల మనుషులు అనేక రోగాల బారిన పడుతున్నారు. దీంతో నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు 15 ఏండ్లు దాటిన వాహనాలను రోడ్డుపై తిరుగకుండా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్​లో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు రవాణా శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

కాలం చెల్లిన వాహనాలకు చెక్ పెట్టేందుకు కసరత్తు మొదలుపెట్టింది. కేంద్ర రవాణాశాఖ మంత్రి కూడా 15 ఏళ్లు దాటిన వాహనాల రెన్యూవల్​ అధికంగా రేట్లు పెంచాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ రవాణాశాఖ సైతం ప్రధానంగా 15 ఏండ్లు దాటిన వాహనాలను వదిలించుకునేలా రెన్యువల్, ఫిట్ నెస్ రేట్లను పెంచాలని నిర్ణయించింది.

దీని ద్వారా రెండు లాభాలున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఒకటి 15 ఏళ్లు దాటిన తర్వాత వాహనాలను నడిపించే వారి సంఖ్య తగ్గటం, మరొటి రవాణా శాఖకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరటం. ఐతే 15 ఏళ్ల తర్వాత వానాహల రెన్యూవల్​ రేట్లను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.

రెన్యువల్ ను ధరలు పెంచేందుకు ప్రతిపాదనలు

ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద 15 ఏళ్లు దాటిన  వాహనాలు దాదాపు 23 లక్షలున్నాయి. వీటిలో టూ వీలర్స్, కార్లు తో పాటు ట్రాన్స్ పోర్ట్ వాహనాలు 93 వేల వరకు ఉన్నాయి. ఐతే ప్రతీ వాహనానికి సెంట్రల్ మోటార్ వెహికిల్ యాక్ట్ 1988 ప్రకారం 15 ఏళ్ల దాటితే మళ్లీ రెన్యూవల్​ చేయించుకోవాల్సి ఉంటుంది. మరో 5 ఏళ్ల కాలానికి రెన్యూవల్​ చేస్తారు. ఐతే 15 ఏళ్లు దాటాగానే దాదాపు అన్ని వాహనాల కాలం చెల్లినట్టే.

అయినప్పటికీ మళ్లీ ఐదేళ్ల రెన్యూవల్​ ఇవ్వటంతో అన్ని వాహనాలను రెన్యూవల్​ చేయించుకుంటున్నారు. ఈ వాహనాల కారణంగా వాయు, శబ్దకాలుష్యం భారీగా పెరుగుతోంది. రెన్యూవల్​ అవకాశం ఉండటంతో చాలా మంది కొత్త వాహనాల జోలికి పోవటం లేదు. పెంచిన రెన్యూవల్​ రేట్లను ప్రభుత్వానికి పంపించింది.

ప్రస్తుతం టూ వీలర్ రెన్యూవల్​ కు 600 రూపాయలు ఉండగా దానిని 2 వేల రూపాయలు చేయాలని నిర్ణయించారు. వ్యక్తిగత కార్ల విషయానికి వస్తే 10 వేల రూపాయలకు పెంచనున్నారు. ప్రస్తుతం రెన్యూవల్​ ధర 735 రూపాయలు మాత్రమే ఉంది. ఇక ట్రాన్స్ పోర్ట్ వాహనాల విషయానికొస్తే వీటి రెన్యూవల్​ ధరను అలాగే ఉంచి ఫిట్ నెస్ ను మాత్రం ఏడాదికి రెండుసార్లు చేయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ట్రాన్స్ పోర్ట్ వాహనాల ఫిట్​నెస్​ ధర 650 రూపాయలుగా ఉంది. అదే విధంగా మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ లకు 800 నుంచి 1700 రూపాయల ఖర్చు కానుంది.

ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చే అవకాశం

రవాణా శాఖ ఇప్పటికే ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వం సైతం అనకూలంగానే ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 10 లక్షల వాహనాలుంటే  ఒక్క గ్రేటర్ పరిధిలోనే సగానికి పైగా వాహనాలు తిరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ లో పొల్యూషన్ తో పాటు ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ వాహనాలు తొలగిస్తే.. ఎలక్ర్టిక్ వాహనాలను ప్రోత్సహించాలని భావిస్తున్నారు.

వాహనాల రెన్యూవల్​ ధరను భారీగా పెంచటంతో పాటు ఇన్సూరెన్స్ కూడా కార్లకు 25 వేల వరకు ఉంది. అటు రెన్యూవల్​, ఇటు ఇన్సూరెన్స్ కలిపి 40 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో కొత్త వాహనాల వైపు మొగ్గు చూపుతారని భావిస్తారు. దీంతో రవాణాశాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఒకే చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

vehicle-number-15-years