వాహనాలకు టీజీ షురూ.. ప్రారంభించిన ఆర్టీఏ కమిషనర్​ జ్యోతి బుద్ధ ప్రసాద్​

వాహనాలకు టీజీ షురూ.. ప్రారంభించిన ఆర్టీఏ కమిషనర్​ జ్యోతి బుద్ధ ప్రసాద్​
  • ఫ్యాన్సీ నంబర్ల రిజర్వేషన్ కూ అవకాశం
  • రూ.9,11,111కు ‘TG 09, 0001’ నంబర్ 
  • దక్కించుకున్న వాహనదారుడు
  • ఫస్ట్​రోజే ఆర్టీఏకు రూ. 2,51,86,437 ఆదాయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్​నంబర్​సిరీస్​టీఎస్ కు​బదులు టీజీగా మారిపోయింది. ఆర్టీఏ అధికారులు శుక్రవారం నుంచి దీనిని అమలులోకి తెచ్చారు. ఈ మేరకు ఆర్టీఏ కమిషనర్​ జ్యోతిబుద్ధ ప్రసాద్​ బటన్​నొక్కి రిజిస్ట్రేషన్ల వెబ్​సైట్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​గడ్కరీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. 

ఈ మేరకు ప్రభుత్వం గెజిట్​విడుదల చేసిందన్నారు. అలాగే, శుక్రవారం ఉదయం 8గంటల నుంచి నంబర్ల రిజర్వేషన్​ప్రక్రియ కూడా ప్రారంభమైందన్నారు. ఇప్పటికే టీఎస్​నంబర్​ప్లేట్​తో ఉన్నవాటిని టీజీగా మార్చడానికి అవకాశం లేదన్నారు. చట్టంలో ఆ వెసులుబాటు లేదు కాబట్టి అవి టీఎస్​సిరీస్​తోనే కొనసాగుతాయన్నారు. ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్​ టీజీ 0001 నంబర్​తో​ప్రారంభమవుతుందన్నారు. ప్రతి ఆర్టీవో, యూనిట్​ కార్యాలయంలో శుక్రవారం నుంచే ప్రారంభమైందన్నారు. 

కాబట్టి వాహనదారులు 0001 నుంచి 0999 వరకు రిజర్వు చేసుకోవచ్చని కమిషన్ తెలిపారు. ప్రతి రోజు అంతకు ముందు రోజు రిజిస్ట్రేషన్​ అయిన నంబర్​ నుంచి 1000 లోపు ప్రస్తుత విధానంలోనే టీజీ సిరీస్​లో రిజర్వు చేసుకునే అవకాశం ఉందన్నారు. కాగా, రాష్ట్రంలో ఏపీ సిరీస్ తో​రిజిస్ట్రేషన్​ అయిన వెహికల్స్​ 70,68,252 ఉండగా.. టీఎస్​సిరీస్​తో రిజిస్ట్రేషన్​ అయిన వాహనాలు 92,82,903 ఉన్నట్టు అధికారులు తెలిపారు.
 
మొదటి రోజే భారీగా ఆదాయం

స్టేట్​లో వెహికల్​నంబర్ల సిరీస్​ను టీఎస్​నుంచి టీజీలోకి మార్చిన మొదటి రోజే ఆర్టీఏకు భారీగా ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్​ సెంట్రల్​ జోన్​ పరిధిలో మొత్తం రూ.30,49,589ల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇందులో రిజర్వేషన్ల ద్వారా రూ.7,52,000లు రాగా, ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా రూ.22,97,589 ల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. కాగా, టీజీ 09, 0001 నంబర్​ను రుద్రరాజు రాజీవ్​కుమార్​అనే వాహనదారుడు దక్కించుకున్నారు. 

దీనికిగాను ఆయన రూ.50 వేలు రిజర్వేషన్​ఫీజు చెల్లించి.. వేలంలో రూ.9,11,111లకు నంబర్ సొంతం చేసుకున్నారు. అలాగే, టీజీ 09, 0909 నెంబర్​ను భవ్యసింధు ఇన్​ఫ్రా ప్రాజెక్ట్స్​ ప్రైవేట్ లిమిటెడ్ వేలంలో రూ.2,20,909లకు దక్కించుకుంది.  కాగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి ఫీజు రూపంలో రూ.1,25,11,000 లు, నంబర్ల​వేలం ద్వారా రూ.1,26,75,437 లు కలిపి మొత్తం ఒక్కరోజులోనే ఆర్టీఏకు రూ.2,51,86,437ల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.