వెలుగు టోర్నీ : మూడు జిల్లాల్లో నేడు ఫైనల్ మ్యాచ్ లు

వెలుగు టోర్నీ : మూడు జిల్లాల్లో నేడు ఫైనల్ మ్యాచ్ లు

సూర్యాపేటలో సూపర్ గా సెమీ ఫైనల్స్
ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లు
 ఫైనల్ చేరిన మిర్యాలగూడ, సూర్యాపేట టీమ్స్.

సూర్యాపేట : వెలుగు టోర్నీ సెమీస్ మ్యాచ్ లు గురువారం ఎస్వీ కాలేజీ గ్రౌండ్ లో ఉదయం మిర్యాలగూడ, నల్లగొండ జట్ల మధ్య మధ్యాహ్నం సూర్యాపేట, భువనగిరి జట్ల మధ్య పోటాపోటీగా జరిగాయి. ఫస్ట్ మ్యాచ్ లో మిర్యాలగూడ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన నల్లగొండ జట్టు 16 ఓవర్లలో 117 పరుగులు చేసి ఆలౌటైంది. నల్లగొండ టీమ్ లో ఆష్రాఫ్ 16 బంతుల్లో ఐదు ఫోర్లతో 27 పరుగులు చేశారు, బషీర్ 16 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేశారు. మిర్యాల గూడ బౌలర్లలో గణేశ్ మూడు ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, జానీ 2 ఓవర్లలో 6 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. తరువాత 118 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మిర్యాలగూడ జట్టు నాలుగు బంతులు మిగిలి ఉండగానే 119 పరుగులు సాధించి మూడువికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.

మిర్యాలగూడ ఆటగాళ్లలో జాని 14 బంతుల్లో 3 ఫోర్లు, ఒకసిక్సుతో 22 పరుగులు చేయగా, మజీద్ 17 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. నల్లగొండ బౌలర్లలో ఏతేశం 3 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు, రాజు 2 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రతిభ కనపర్చిన జానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

రెండవ మ్యాచ్ సూర్యాపేట, భువనగిరి జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సూర్యాపేట జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది, ముందుగా బ్యాటింగ్ కు దిగిన భువనగిరి జట్టు 14.4 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌటైంది. భువనగిరి టీమ్ లో జకీరుద్దీన్ 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సులతో 36 పరుగులు చేయగా, జగదీష్ 15 బంతుల్లో రెండు ఫోర్లతో 19 పరుగులు చేశాడు. సూర్యాపేట బౌలర్లలో శ్రీకాంత్ 3 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ దేవేందర్ 3 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 2 వికెట్లు నేలకూల్చాడు. 99 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగినసూర్యాపేట జట్టు ఇంకా1 ఓవర్ మిగలి ఉండగానే 14 ఓవర్లలో విజయాన్ని అందుకుంది.

సూర్యాపేట ఆటగాళ్లలో ప్రవణ్ 31 బంతుల్లో ఐదు ఫోర్లతో 38 పరుగులు, అనుదీప్ 18 బంతుల్లో మూడు ఫోర్లతో 24 పరుగులు, శ్రీకాంత్ 16 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సుతో 20 పరుగులు చేశాడు. భువనగిరి బౌలర్లలో నరేందర్ 3 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టగా, జకీరుద్దీన్ 3 ఓవర్లలో 18 పరుగులిచ్చి 1 వికెట్  పడగొట్టారు. మ్యాచ్ లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన సూర్యాపేట ఆటగాడు శ్రీకాంత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సెమీస్ లో గెలిచిన జట్లు మిర్యాలగూడ, సూర్యాపేట జట్లు శుక్రవారం ఫైనల్ లో తలపడనున్నాయి. వీటితో పాటు..సంగారెడ్డి-సిద్ధిపేట, పాలమూరు-గద్వాల జిల్లాల టీమ్స్ మధ్య ఇవాళ ఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి

గ్రామీణ క్రీడాకారులకు మంచి  అవకాశం – ఎస్పీ రావిరాలవెంకటేశ్వర్లు

అంతకుముందు సెమీ ఫైనల్ మ్యాచ్ లను ప్రారంభించారు సూర్యాపేట జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు. ఎస్వీ కాలేజీ ప్రిన్సిపాల్ రవీంద్రాచారితో కలిసి గేమ్స్ ను ఆయన స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,,  గ్రామీణ ప్రాంత ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులకు వెలుగు దినపత్రిక, వీ6 న్యూస్ ఛానల్ ద్వారా అవకాశాలు కల్పిచడం మంచి విషయం అన్నారు. క్రీడాకారులు కూడా టీమ్ స్పిరిట్ తో ఆడి అవకాశం వినియోగించుకోవాలన్నారు. ఇలాంటి క్రీడలు ఏర్పాటు చేసి నేటితరం యువతకు మంచి అవకాశం కల్పించి.. వారి భవిష్యత్ కు భరోసా ఇస్తున్న వెలుగు దినపత్రిక, వీ6 యాజమాన్యానికి అభినందలు తెలిపారు. ఇలాంటి పోటీలు భవిష్యత్తులో కూడా నిర్వహిస్తూనే ఉండాలని ఆయన ఆకాంక్షించారు.